contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఓటర్ల వెరిఫికేషన్‌లో బీఎల్ఓలపై అసమాన పని భారం

  • 500 నుంచి 1,200 మంది ఓటర్ల బాధ్యతలు .. గడువు తక్కువగా ఉండటంతో క్షేత్రస్థాయిలో తీవ్ర ఒత్తిడి
  • సుప్రీంకోర్టు మార్గదర్శకాలు అమలు చేయాలని, అదనపు సిబ్బంది నియమించాలని ఉద్యోగుల విజ్ఞప్తి

తిరుపతి : రాష్ట్రవ్యాప్తంగా కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ఓటర్ల వెరిఫికేషన్ ప్రక్రియ క్షేత్రస్థాయిలో బూత్ లెవల్ ఆఫీసర్ల (బీఎల్ఓలు)పై తీవ్ర పని ఒత్తిడిని సృష్టిస్తోందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బూత్‌ల వారీగా పని విభజనలో అసమానతలు ఉండటంతో కొందరు తక్కువ సమయంలో విధులు పూర్తి చేస్తుండగా, మరికొందరు అధిక సంఖ్యలో ఓటర్ల వెరిఫికేషన్ బాధ్యతలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు.

క్షేత్రస్థాయి సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం, కొన్ని పోలింగ్ బూత్‌లలో బీఎల్ఓలకు 500 లేదా అంతకంటే తక్కువ మంది ఓటర్ల వెరిఫికేషన్ బాధ్యతలు ఉండగా, మరికొన్ని బూత్‌లలో ఒక్కో బీఎల్ఓకు 1,200 మందికి పైగా ఓటర్లను ధృవీకరించే బాధ్యతలు అప్పగించారని పేర్కొంటున్నారు. దీంతో పని భారంలో తీవ్ర అసమానత ఏర్పడిందని వారు అంటున్నారు.

వెరిఫికేషన్ ప్రక్రియకు నిర్దేశించిన గడువు తక్కువగా ఉండటంతో ఉదయం నుంచి రాత్రి వరకు క్షేత్రస్థాయిలో పనిచేసినా లక్ష్యాన్ని చేరుకోవడం కష్టంగా మారుతోందని పలువురు బీఎల్ఓలు వాపోతున్నారు. కుటుంబ బాధ్యతలు, వ్యక్తిగత ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ నిరంతరం విధులు నిర్వర్తించాల్సి వస్తోందని, పని ఒత్తిడి మానసికంగా కూడా ప్రభావం చూపుతోందని వారు పేర్కొంటున్నారు.

ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, నిత్య పరిపాలనా బాధ్యతలతో బిజీగా ఉండగా, అదనంగా భారీ స్థాయిలో ఓటర్ల వెరిఫికేషన్ బాధ్యతలు అప్పగించడం వల్ల ఇబ్బందులు మరింత పెరిగాయని ఉద్యోగులు చెబుతున్నారు.

బీఎల్ఓల నియామకానికి సంబంధించి సుప్రీంకోర్టు సూచించిన మార్గదర్శకాల ప్రకారం వివిధ ప్రభుత్వ శాఖల సిబ్బందిని వినియోగించుకునే అవకాశం ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ప్రధానంగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులపైనే బాధ్యతలు కేంద్రీకరించారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఈ పరిస్థితుల నేపథ్యంలో పని భారాన్ని సమానంగా పంచేలా అధిక ఓటర్లు ఉన్న బూత్‌లను విభజించి అదనపు సిబ్బందిని నియమించాలని ఉద్యోగ సంఘాలు, బీఎల్ఓలు కోరుతున్నారు. అలాగే ఓటర్ల వెరిఫికేషన్ గడువును పొడిగించి, సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు ఇతర ప్రభుత్వ శాఖల సిబ్బందిని కూడా ఈ ప్రక్రియలో భాగస్వామ్యం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

జిల్లా కలెక్టర్లు, ఎన్నికల ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని బీఎల్ఓలపై ఉన్న పని ఒత్తిడిని తగ్గించేలా తక్షణ చర్యలు చేపట్టాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :