కాకినాడ : ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో క్షేత్రస్థాయిలో ప్రజలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని పౌర సంక్షేమ సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. శనివారం సాయంత్రం గాంధీనగర్ పార్కులో ఎం.డి. సులేమాన్, ఎం. వీరప్రభాకరరావు, ఎ. ఏసు ఆధ్వర్యంలో ప్రత్యేక సవరణ ప్రక్రియపై పౌర సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎన్యూమరేషన్ ఫారాలను సక్రమంగా పూరించి బీఎల్‌వోలకు అందజేసి రశీదులు పొందిన పౌరులను సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు ప్రత్యేకంగా అభినందించారు. ఓటు హక్కుతో పాటు పౌర బాధ్యతలను కూడా గుర్తించి వ్యవహరించినందుకు వారికి చాక్లెట్లు పంపిణీ చేశారు.
సమీక్షలో పాల్గొన్న వారి వివరాల ప్రకారం, 25 శాతం మంది ఇప్పటికీ ఫారాలను సమర్పించలేదని, 10 శాతం మంది వద్దకు బీఎల్‌వోలు రాలేదని, మరో 10 శాతం మందికి ప్రక్రియపై సరైన సమాచారం లేదని, 5 శాతం మంది అవసరమైన పత్రాల సేకరణలో ఉన్నట్లు వెల్లడైంది.
సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ, ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో ప్రతి స్థానిక పౌరుడు స్వీయ బాధ్యతతో భాగస్వామ్యం కావాలని సూచించారు. లేకపోతే భవిష్యత్తులో ఓటరు గుర్తింపు కార్డు పొందడంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు.
డిజిటలైజేషన్‌లో సాంకేతిక లోపాలు, పాత ఓటర్ల జాబితాలు మెషిన్ రీడబుల్ ఫార్మాట్‌లో అందుబాటులో లేకపోవడం వల్ల అధికారులు పీడీఎఫ్ రికార్డుల నుంచి పేర్లను మాన్యువల్‌గా వెతకాల్సి వస్తోందని తెలిపారు. 2002, 2024 సంవత్సరాల ఓటర్ల జాబితాలను ఎన్నికల సంఘం డిజిటల్ రూపంలో అందించకపోవడం వల్ల పాత రికార్డుల పరిశీలన, కొత్త ఎన్యూమరేషన్ ఫారాల సేకరణ, డేటా డిజిటలైజేషన్ పనులు ఒకేసారి నిర్వహించాల్సి రావడంతో సమాచారాన్ని సకాలంలో అందించలేని పరిస్థితి ఏర్పడిందన్నారు.
సుమారు 30 శాతం మంది ఓటర్లలో అవగాహన లోపం కారణంగా ఫారాల భర్తీపై గందరగోళం నెలకొన్నట్లు పేర్కొన్నారు. ఇంటింటికీ ఎన్యూమరేషన్ పత్రాలు అందజేస్తున్నప్పటికీ వాటిని ఎలా పూరించాలో తెలియక చాలామంది ఆందోళన చెందుతున్నారని తెలిపారు. వివాహిత మహిళలు కొత్త ప్రాంతానికి ఓటును మార్చుకునే ప్రక్రియలో సమర్పించాల్సిన పత్రాలపై స్పష్టమైన మార్గదర్శకాలు అందరికీ చేరలేదని అన్నారు.
జూలై 14లోగా సవరణ ప్రక్రియ పూర్తి చేయాలనే లక్ష్యంతో అధికారులు పనిచేస్తున్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో గడువులోగా పూర్తి చేయడం సవాలుగా మారిందన్నారు. సమన్వయ లోపం కారణంగా అనేక చోట్ల క్షేత్రస్థాయి అధికారులు పాత జాబితాలపై పూర్తి అవగాహన లేక ఓటర్లకు తగిన సహాయం అందించలేకపోతున్నారని పేర్కొన్నారు.
వలస కార్మికులు, వృద్ధులు, దివ్యాంగులు, సాధారణ మధ్యతరగతి ప్రజలు నిర్ణీత సమయంలో అవసరమైన పత్రాలను సమర్పించలేకపోతున్నారని, సరైన విచారణ, ముందస్తు నోటీసులు లేకుండానే అర్హులైన ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగించబడతాయేమోనన్న భయాందోళనలు పెరుగుతున్నాయని తెలిపారు.
ఈ నేపథ్యంలో ప్రత్యేక సవరణ గడువును కనీసం 30 రోజులు పొడిగించాలని, నగర, గ్రామ, వార్డు స్థాయిల్లో ప్రత్యేక సహాయ కేంద్రాలను ఏర్పాటు చేయాలని, సంచార మైక్ ప్రచార వాహనాల ద్వారా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పౌర సంక్షేమ సంఘం ప్రభుత్వాన్ని, ఎన్నికల అధికారులను కోరింది.
సమీక్ష సమావేశంలో రంగాచారి, హనుమంతరావు, మార్కండేయు మూర్తి, శ్రీనివాస దీక్షితులు, వెంకయ్య, శ్రీరామశర్మ, భూపతి, సాయిలక్ష్మీ, రూపాదేవి, పార్వతి మణి తదితరులు పాల్గొన్నారు. అధికారుల అనుమతితో మైక్ ప్రచార వాహనం ద్వారా స్వచ్ఛంద అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు.








