కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో స్థానిక పేపర్ మిల్లు కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారం రెండో రోజుకు చేరుకున్నాయి. కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ మిల్లు ప్రధాన గేటు వద్ద ఈ దీక్షలు కొనసాగుతున్నాయి.
రెండవ రోజు నిర్వహించిన రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని ఐఎన్టియుసి జిల్లా అధ్యక్షుడు అల్లూరి లోకేష్ సందర్శించి కార్మికులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా కార్మికుల పోరాటానికి ఐఎన్టియుసి తరఫున పూర్తి మద్దతు ప్రకటించారు.
అల్లూరి లోకేష్ మాట్లాడుతూ పేపర్ మిల్లు యాజమాన్యం కార్మికుల శ్రమను గుర్తించకుండా వారి సమస్యలను నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. ఎన్నో ఏళ్లుగా మిల్లును నమ్ముకుని పనిచేస్తున్న కార్మికుల హక్కులను కాలరాస్తే సహించబోమన్నారు. మిల్లులో కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించాలని, కార్మికుల న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకు ఐఎన్టియుసి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. అవసరమైతే జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేయడానికి కూడా వెనుకాడబోమన్నారు.
మిల్లు యాజమాన్యం వెంటనే స్పందించి కార్మిక సంఘాల ప్రతినిధులతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ ముఖ్య నాయకులు, వివిధ కార్మిక సంఘాల ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో పేపర్ మిల్లు కార్మికులు పాల్గొన్నారు.









