వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో పార్టీ కీలక సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వం రెండేళ్ల పాలనలో ప్రజలను పూర్తిగా నిరాశపరిచిందని ఆరోపించారు.
మాజీ మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో చంద్రబాబు పాలనలో చోటుచేసుకున్న వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడా ఏకగ్రీవాలకు అవకాశం ఇవ్వకుండా ప్రతి కార్యకర్త అప్రమత్తంగా ఉండి పోరాడాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని, మంత్రి లోకేశ్ ఒక్క శాఖను కూడా సమర్థంగా నడపలేకపోతున్నారని విమర్శించారు.
దమ్ముంటే చంద్రబాబు నాయుడు వైఎస్ జగన్తో బహిరంగ చర్చకు రావాలని కొడాలి నాని సవాల్ విసిరారు. ప్రజల సమస్యలపై ప్రశ్నించే ఏకైక నాయకుడు జగన్ మాత్రమేనని, ప్రతిపక్ష స్వరాన్ని అణగదొక్కడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
మరో మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన ‘సూపర్ సిక్స్’ హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. బాండ్ల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించారని విమర్శించారు. ఈ అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జూన్ 4 నుంచి జూన్ 12 వరకు ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.
టీడీపీ నేతలు చేస్తున్న ‘గొడ్డలి పార్టీ’ వ్యాఖ్యలు కేవలం ప్రజల దృష్టి మళ్లించే రాజకీయాలేనని పేర్ని నాని కొట్టిపారేశారు. ప్రజల సమస్యలపై పోరాటం కొనసాగిస్తామని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రతి ఇంటికీ తీసుకెళ్తామని వైసీపీ నేతలు స్పష్టం చేశారు.








