contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

రెచ్చిపోతున్న మట్టి మాఫియా .. అధికారుల పై విమర్శలు

నిజామాబాద్, జూన్ 3: నిజామాబాద్ జిల్లా పోతంగల్, కోటగిరి ప్రాంతాల్లో మట్టి మాఫియా ఆగడాలు రోజురోజుకూ పెరుగుతున్నాయని స్థానికులు, ప్రజా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా రాత్రి, పగలు తేడా లేకుండా ట్రాక్టర్లు, భారీ టిప్పర్లతో అక్రమంగా మట్టిని తవ్వి రియల్ ఎస్టేట్ వెంచర్లు, ఇటుక బట్టీలు, ప్రైవేట్ స్థలాలకు తరలిస్తున్నారని ఆరోపిస్తున్నారు.

జిల్లాలో నల్లమట్టి, ఎర్రమట్టి తవ్వకాల కారణంగా పోతంగల్, కోటగిరి మరియు పరిసర ప్రాంతాల్లోని సహజసిద్ధమైన మట్టి గుట్టలు, చెరువులు క్రమంగా గుల్లవుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. వందలాది లారీలు, టిప్పర్ల ద్వారా మట్టిని తరలించడం వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ అక్రమ దందాను అరికట్టాల్సిన మైనింగ్, రెవెన్యూ, పోలీస్ శాఖల మధ్య సమన్వయం లోపించిందని, కొందరు అధికారులు మామూళ్ల మత్తులో చోద్యం చూస్తున్నారంటూ ప్రజా సంఘాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి.

ఇటీవల బాన్సువాడ పట్టణంలోని ఎల్లయ్య చెరువులో నిబంధనలకు విరుద్ధంగా నల్లమట్టి తరలింపుపై అఖిలపక్ష నాయకులు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. ఈ అంశంపై వార్తా పత్రికలు, టెలివిజన్ ఛానళ్లలో కథనాలు ప్రసారమవడంతో స్పందించిన అధికారులు టిప్పర్ల వినియోగాన్ని నిషేధించి, కేవలం ట్రాక్టర్ల ద్వారానే మట్టిని తరలించాలని సూచించినట్లు సమాచారం.

అయితే వ్యవసాయ భూముల అవసరాలకే మట్టిని తరలించాల్సి ఉన్నప్పటికీ, కొందరు నాయకులు, వ్యాపారులు అధికారుల ఆదేశాలను పట్టించుకోకుండా వెంచర్లు, ప్రైవేట్ ప్లాట్లకు మట్టిని తరలిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉండగా, పోతంగల్ మండలంలోని జిల్లెపల్లి సమీపంలో పట్టపగలే మూడు జేసీబీలు, దాదాపు 20 టిప్పర్ల సహాయంతో నల్లమట్టిని ఒక ప్రైవేట్ వెంచర్‌కు తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ చేపట్టినట్లు తెలిసింది.

ఈ విషయమై ఇరిగేషన్ శాఖ అధికారిని వివరణ కోరగా, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కేవలం వ్యవసాయ భూములకు మాత్రమే ట్రాక్టర్ల ద్వారా మట్టిని తరలించేందుకు అనుమతి ఉన్నదని, టిప్పర్ల ద్వారా రవాణాకు ఎలాంటి అనుమతి లేదని ఇరిగేషన్ అధికారి సత్యనారాయణ స్పష్టం చేశారు.

అక్రమ మట్టి తవ్వకాలు, రవాణాపై సంబంధిత శాఖలు సమన్వయంతో చర్యలు తీసుకుని పర్యావరణాన్ని కాపాడాలని, సహజ వనరుల దోపిడీని అరికట్టాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :