పాకాల, జూన్ 3: తిరుపతి జిల్లా పాకాల మండలంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం రైతు విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో మామిడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై పార్టీ నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగా మామిడి రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారని ఆరోపించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ప్రస్తుతం మార్కెట్లో మామిడి కాయలకు గిట్టుబాటు ధర లేక రైతులు ఆర్థికంగా కుదేలవుతున్నారని తెలిపారు. టన్ను మామిడి ధర కనీసం రూ.5 వేల వరకు కూడా పలకడం లేదని, ఈ ధర రైతులకు ఏమాత్రం గిట్టుబాటు కాదన్నారు. ఒక టన్ను మామిడి పంట సాగుకు భూమి దున్నడం, ఎరువులు, పురుగుల మందులు, కూలీల ఖర్చులు, ట్రాక్టర్ల బాడిగలు తదితర అవసరాలకు రూ.10 వేలకుపైగా వ్యయం అవుతోందని పేర్కొన్నారు.
ప్రభుత్వం కల్పిస్తున్న ధరతో కనీస పెట్టుబడి కూడా తిరిగి రాక రైతులు నష్టాల ఊబిలో కూరుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న, సన్నకారు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారిందని, వ్యవసాయం చేయడమే భారంగా మారిందన్నారు.
అదేవిధంగా మార్కెట్లో యూరియా వంటి ఎరువుల కొరత తీవ్రంగా ఉందని, రైతులు గంటల తరబడి క్యూలలో నిలబడాల్సిన పరిస్థితి నెలకొందని విమర్శించారు. రైతులకు అవసరమైన కనీస సౌకర్యాలు కూడా అందడం లేదని మండిపడ్డారు.
గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించి అన్ని విధాలుగా ఆదుకున్నారని గుర్తు చేశారు. అయితే ప్రస్తుతం పాలకుల నిర్లక్ష్యం కారణంగా రైతులు తమ మామిడి తోటలను అమ్ముకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి ప్రధాన పంటగా ఉండటంతో వేలాది కుటుంబాలు దీనిపైనే ఆధారపడి జీవిస్తున్నాయని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రతి టన్ను మామిడికి కనీసం రూ.10 వేల గిట్టుబాటు ధర కల్పించి ఆ మొత్తాన్ని నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే పొగాకు, చెరుకు పంటల తరహాలో మామిడి రైతుల ప్రయోజనాల కోసం ప్రత్యేక “మామిడి బోర్డు”ను ఏర్పాటు చేయాలని కోరారు.
రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వం స్పందించి మామిడి రైతులకు న్యాయం చేయాలని, మామిడి, చెరుకు, పొగాకు రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. లేనిపక్షంలో అప్పుల బాధలు భరించలేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడే ప్రమాదకర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని వైఎస్సార్సీపీ నాయకులు హెచ్చరించారు.








