నగరంలో ట్రాఫిక్‌ను మరింత క్రమబద్ధీకరించడంతో పాటు ప్రయాణికుల భద్రతను మెరుగుపరచే లక్ష్యంతో కరీంనగర్ బస్టాండ్ ఇన్‌గేట్ వద్ద నూతన ట్రాఫిక్ ఔట్‌పోస్ట్ బూత్‌ను పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం శనివారం ఘనంగా ప్రారంభించారు. ట్రాఫిక్ ఏసీపీ యాదగిరి స్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో సీపీ రిబ్బన్ కట్ చేసి బూత్‌ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీపీ గౌష్ ఆలం మాట్లాడుతూ, నగరంలో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాల్లో కరీంనగర్ బస్టాండ్ పరిసర ప్రాంతం ఒకటని, ఇక్కడ ట్రాఫిక్ సమస్యలను సమర్థవంతంగా నియంత్రించడానికి మరియు నిరంతరం పర్యవేక్షించడానికి ఈ నూతన ఔట్‌పోస్ట్ బూత్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రయాణికులు, వాహనదారులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ట్రాఫిక్ సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు.
ట్రాఫిక్ నియంత్రణతో పాటు ప్రజలకు సురక్షితమైన రవాణా వాతావరణాన్ని కల్పించడమే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. నగరంలో పెరుగుతున్న వాహనాల రద్దీకి అనుగుణంగా ట్రాఫిక్ నిర్వహణలో ఆధునిక పద్ధతులను అమలు చేస్తున్నామని చెప్పారు.
కార్యక్రమంలో భాగంగా మండుతున్న ఎండల్లో రోడ్లపై నిలబడి విధులు నిర్వర్తిస్తున్న ట్రాఫిక్ పోలీసుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని సీపీ వారికి ప్రత్యేక కూలింగ్ గ్లాసెస్ పంపిణీ చేశారు. తీవ్ర ఎండల ప్రభావం నుంచి కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇవి ఉపయోగపడతాయని తెలిపారు. విధి నిర్వహణతో పాటు సిబ్బంది ఆరోగ్య సంరక్షణకు కూడా శాఖ ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు.
ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ యాదగిరి స్వామి, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు సంజీవ్, అంజయ్య, సబ్ ఇన్స్పెక్టర్లు, ట్రాఫిక్ పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం నూతన ఔట్‌పోస్ట్ బూత్ వద్ద ట్రాఫిక్ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను సీపీ పరిశీలించారు.








