contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

అటవీ వారోత్సవాల్లో భాగంగా పోచారంలో బర్డ్ వాక్ నిర్వహణ

మెదక్ జిల్లా , తూప్రాన్  : అటవీ వారోత్సవాల సందర్భంగా ప్రకృతి పరిరక్షణ, పక్షుల సంరక్షణపై ప్రజల్లో అవగాహన పెంపొందించే లక్ష్యంతో పోచారంలోని డీబీసీ పరిసర ప్రాంతంలో శనివారం బర్డ్ వాక్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ నగేష్ ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ప్రారంభించారు.

అటవీ శాఖ డీఎఫ్ఓ జోజి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా ప్రజాసంబంధాల అధికారి (డీపీఆర్వో) రామచంద్ర రాజు, అటవీ శాఖ అధికారులు, సిబ్బంది, ప్రకృతి ప్రేమికులు పాల్గొన్నారు. అనంతరం అదనపు కలెక్టర్ నగేష్, డీఎఫ్ఓ జోజితో కలిసి నాలుగు కిలోమీటర్ల మేర బర్డ్ వాక్‌లో పాల్గొని వివిధ రకాల పక్షులను పరిశీలించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా అటవీ వారోత్సవాలను విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే ప్రకృతి, పక్షుల సంరక్షణపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు బర్డ్ వాక్ కార్యక్రమాన్ని నిర్వహించామని పేర్కొన్నారు.

పోచారం ప్రాంతం తన సహజసిద్ధమైన అందాలతో పాటు సమృద్ధిగా ఉన్న పక్షి వైవిధ్యానికి ప్రసిద్ధి చెందిందన్నారు. పోచారం జలాశయం, అభయారణ్యం పరిసర ప్రాంతాల్లో వలస నీటి పక్షులు, కొంగలు, ఐబిస్‌లు, బాతులు తదితర అనేక జాతుల పక్షులు కనిపిస్తాయని చెప్పారు. ఈ ప్రాంతం పక్షి వీక్షణకు ముఖ్య కేంద్రంగా నిలుస్తోందని వివరించారు.

ప్రకృతి ప్రేమికులు, విద్యార్థులు, అధికారులు ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొని పక్షుల జీవన విధానం, వలస పక్షుల ప్రాముఖ్యత, పర్యావరణ సమతుల్యతలో వాటి పాత్రను తెలుసుకోవాలని సూచించారు. పక్షుల సంరక్షణ కోసం ప్రతి ఒక్కరూ చెట్లు నాటడం, నీటి వనరులను పరిరక్షించడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం వంటి చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు.

ప్రకృతిని దగ్గరగా ఆస్వాదిస్తూ పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించేందుకు బర్డ్ వాక్ వంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎఫ్‌ఆర్‌వోలు, బీట్ ఆఫీసర్లు, అటవీ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :