మెదక్ జిల్లా : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక–99 రోజుల కార్యక్రమంలో భాగంగా బాలల భద్రత వారోత్సవాలను పురస్కరించుకుని శనివారం పాపన్నపేట మండలంలోని మంజీరా ఫంక్షన్ హాల్లో బాల పంచాయతీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ పోలీస్ ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో, మై ఛాయస్ ఫౌండేషన్ మరియు యంగిస్తాన్ స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు మాట్లాడుతూ బాలల హక్కుల పరిరక్షణ, భద్రత, నాయకత్వ లక్షణాల అభివృద్ధికి బాల పంచాయతీలు సమర్థవంతమైన వేదికలుగా నిలుస్తాయని పేర్కొన్నారు. గ్రామాల్లోని బాలబాలికల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుంటూ పనిచేసే విధంగా బాల పంచాయతీలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
బాలల భద్రత, విద్య, ఆరోగ్యం, పరిశుభ్రత, బాల్య వివాహాల నివారణ, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన వంటి కీలక అంశాలపై బాల పంచాయతీ ప్రతినిధులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. గ్రామాభివృద్ధి, బాలల సంక్షేమ కార్యక్రమాల్లో పిల్లలను భాగస్వాములను చేయడం ద్వారా వారిలో నాయకత్వ లక్షణాలు, బాధ్యతాయుతమైన పౌరసత్వం పెంపొందుతాయని అన్నారు.
బాల పంచాయతీ సభ్యులు తమ గ్రామాల్లో గుర్తించిన సమస్యలను అధికారులు సానుకూల దృక్పథంతో స్వీకరించి, వాటి పరిష్కారానికి తగిన చర్యలు చేపట్టాలని ఎస్పీ సూచించారు. బాలల అనుకూల వాతావరణం కల్పించడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్, సీడబ్ల్యూసీ చైర్మన్ ఉప్పలయ్య, డీసీపీఓ నాగరాజు, సీసీఎస్ సీఐ రాజశేఖర్ రెడ్డి, సీఐడీ ఉమెన్ సేఫ్టీ వింగ్ సీఐ రాజేష్, రూరల్ సీఐ జార్జ్, యంగిస్తాన్ ఫౌండేషన్ ప్రతినిధి వృత్విక, విజన్ ఎన్‌జీఓ ప్రతినిధులు రాజు, యాదగిరి, తహసీల్దార్ సతీష్, ఎంపీడీఓ విష్ణువర్ధన్, పీఎం శ్రీ పాపన్నపేట ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మహేష్, నాయకులు శ్రీకాంత్ అప్ప, మాజీ సర్పంచ్ గురుమూర్తి గౌడ్, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్, బీజేపీ మాజీ మండల అధ్యక్షులు రాములు, కిష్టయ్య, నాయకులు శివయ్య, సంగమేష్, ప్రసాద్ గౌడ్, ప్రవీణ్ గౌడ్, వివిధ గ్రామాల విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
కార్యక్రమంలో బాలల హక్కులు, భద్రత, సామాజిక బాధ్యతలపై అవగాహన కల్పించడంతో పాటు బాలల సమస్యల పరిష్కారానికి సామూహిక కృషి అవసరమని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు.








