contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

2027 నాటికి ప్రతి రైతుకు తప్పుల్లేని పాస్‌బుక్.. భూ రికార్డులకు బ్లాక్‌చెయిన్ భద్రత: సీఎం చంద్రబాబు

అమరావతి – రాష్ట్రంలోని భూ రికార్డులన్నింటినీ 2027 నాటికి పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసి, ప్రతి రైతు చేతిలో తప్పులు లేని పట్టాదారు పాస్‌బుక్ అందిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతంలో సోమవారం నిర్వహించిన ‘మీ భూమి – మీ హక్కు’ సభలో ఆయన కీలక ప్రకటనలు చేశారు.

ఈ సందర్భంగా రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాస్‌బుక్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం, గత ప్రభుత్వ హయాంలో భూ రికార్డుల నిర్వహణలో జరిగిన అవకతవకల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని విమర్శించారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజల ఆస్తుల రక్షణ కోసం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేశామని గుర్తు చేశారు.

ప్రస్తుతం జారీ చేస్తున్న కొత్త పాస్‌బుక్‌లలో క్యూఆర్ కోడ్‌తో పాటు అత్యాధునిక భద్రతా ఫీచర్లను పొందుపరిచామని తెలిపారు. భూ రికార్డుల ప్రక్షాళన ఒక క్లిష్టమైన ప్రక్రియ అని, గత పాలకులు సృష్టించిన సమస్యలను పరిష్కరించడానికి మూడేళ్ల సమయం అవసరమవుతుందని పేర్కొన్నారు.

భూ రికార్డుల వ్యవస్థలో పారదర్శకత, భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ దేశంలోనే తొలిసారిగా బ్లాక్‌చెయిన్ ఆధారిత భూ రికార్డుల వ్యవస్థను అమలు చేస్తున్నట్లు సీఎం వెల్లడించారు. ప్రతి భూమి యూనిట్‌కు ప్రత్యేక బ్లాక్‌చెయిన్ ఐడీ కేటాయించడం ద్వారా రికార్డుల ట్యాంపరింగ్‌కు పూర్తిగా అడ్డుకట్ట వేయవచ్చని చెప్పారు.

ఇప్పటికే ‘రీ-సర్వే 2.0’ కింద 1,836 గ్రామాల్లో తుది రికార్డ్ ఆఫ్ రైట్స్ (ఆర్‌ఓఆర్) పూర్తయిందని, 9 లక్షల లావాదేవీలకు 100 శాతం ఆటోమేటిక్ మ్యుటేషన్ అమలు చేస్తున్నామని తెలిపారు. వాట్సాప్ ద్వారా మ్యుటేషన్ దరఖాస్తు చేసుకునే సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వెల్లడించారు.

వారసత్వ హక్కుల బదిలీ ప్రక్రియను సులభతరం చేశామని, రూ.10 లక్షల లోపు విలువైన ఆస్తుల బదిలీకి కేవలం రూ.100 రుసుము మాత్రమే వసూలు చేస్తున్నామని పేర్కొన్నారు. తిరుపతి జిల్లా శెట్టిపల్లి భూముల వివాదాన్ని పరిష్కరించడంతో పాటు 1.37 లక్షల ఎకరాల విలేజ్ సర్వీస్ ఇనాం భూములను 22ఏ జాబితా నుంచి తొలగించినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై కూడా సీఎం తీవ్ర విమర్శలు గుప్పించారు. రైతుల కష్టాలు తెలియని వారు భూములపై రాజకీయాలు చేస్తున్నారని, ప్రజల హక్కులను కాలరాసే విధానాలను తమ ప్రభుత్వం ఎప్పటికీ సహించదని అన్నారు.

కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనను సమపాళ్లలో అందించిందని చంద్రబాబు పేర్కొన్నారు. పెన్షన్లు, తల్లికి వందనం, స్త్రీశక్తి, అన్నదాత సుఖీభవ వంటి పథకాల ద్వారా అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతోందన్నారు. డీఎస్సీ ద్వారా 16 వేల ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేశామని తెలిపారు.

గోదావరి జిల్లాల్లో ఆక్వా, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని సీఎం వెల్లడించారు. ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్‌ను రూ.1.50కే అందిస్తున్నామని గుర్తు చేశారు. ఆక్వా వ్యర్థాలతో న్యూట్రాస్యూటికల్ ఔషధాల తయారీ ద్వారా కాలుష్య నివారణతో పాటు అదనపు ఆదాయం పొందే అవకాశాలు ఉన్నాయని సూచించారు.

ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని పేర్కొన్న ముఖ్యమంత్రి, ఆగస్టు 15 నాటికి రాష్ట్రవ్యాప్తంగా ‘సంజీవని డిజిటల్ హెల్త్ రికార్డ్’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని ప్రకటించారు. అలాగే జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కోటి మందితో ‘యోగాంధ్ర’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు.

2047 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను సంపన్నమైన, ఆరోగ్యవంతమైన, సంతోషకరమైన రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని సీఎం చంద్రబాబు పునరుద్ఘాటించారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్, నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :