కరీంనగర్ జిల్లా : నగరంలోని శనివారం మార్కెట్ పరిధిలో కల్తీ కారంపొడి విక్రయిస్తున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు కరీంనగర్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈరోజు మెరుపు దాడులు నిర్వహించారు. మార్కెట్లోని “గౌరిశెట్టి రమేష్” మరియు “సిద్ధంశెట్టి చక్రపాణి” కిరాణం, సుగంధ ద్రవ్యాల దుకాణాల్లో (Spices Shops) జరిపిన ఈ సోదాల్లో భారీ మొత్తంలో కల్తీ అనుమానిత నిల్వలను కనుగొన్నారు.
ఈ దాడుల సమాచారాన్ని వెంటనే ఫుడ్ సేఫ్టీ అధికారులకు చేరవేయగా, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు అంకిత్ రెడ్డి, రోహిత్ రెడ్డిలు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. టాస్క్ ఫోర్స్ బృందం వారి సమక్షంలో సుమారు 47 బస్తాల కారంపొడి (ప్రతి బస్తా బరువు 50 కిలోలు), 2 బస్తాల పసుపు, మరియు 1 బస్తా ధనియాల పొడిని స్వాధీనం చేసుకుని ఫుడ్ సేఫ్టీ అధికారులకు అప్పగించారు.
ఫుడ్ సేఫ్టీ అధికారులు సదరు దుకాణాల నుండి నమూనాలను సేకరించి, పరీక్షల నిమిత్తం ల్యాబొరేటరీకి పంపించారు. ఈ ల్యాబ్ పరీక్షల ఫలితాలు వచ్చే వరకు సదరు స్టాక్‌ను పూర్తిగా సీజ్ చేయడం జరిగిందని, అలాగే ఈ సుగంధ ద్రవ్యాల అమ్మకాలపై పూర్తి నిషేధం విధించినట్లు అధికారులు తెలిపారు. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడే కల్తీ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు.
ఈ దాడుల్లో టాస్క్ ఫోర్స్ ఏసీపీ వాసాల సతీష్ ఎస్సైలు మామిడాల సురేందర్, శ్రీకాంత్ కానిస్టేబుల్ సాయిదీప్ లు పాల్గొన్నారు.








