పాలకొండ, పార్వతీపురం మన్యం జిల్లా: పాలకొండలో దారుణ హత్యకు గురైన గిరిజన యువతి బిడ్డిక ఉషారాణికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ సంఘాలు సోమవారం భారీ నిరసన కార్యక్రమం చేపట్టాయి. హత్యకు పాల్పడిన నిందితులకు ఉరిశిక్ష విధించాలని, బాధిత కుటుంబానికి రూ.5 కోట్ల నష్టపరిహారం అందించాలని, కుటుంబంలోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని ఆదివాసీ నేతలు ప్రభుత్వాన్ని కోరారు.
సీతంపేట గిరిజన సంత సమీపం నుంచి ఐటీడీఏ కార్యాలయం వరకు సుమారు రెండు వేల మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆదివాసీ సంఘాల నాయకులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. అనంతరం ఐటీడీఏ అధికారులకు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ఆదివాసీ నాయకులు మాట్లాడుతూ, ప్రశాంతంగా ఉన్న పాలకొండ ప్రాంతంలో ఒక ఆదివాసీ యువతిని అత్యంత కిరాతకంగా హత్య చేయడం అమానుషమని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన మహిళల భద్రత కోసం ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాలను మరింత పటిష్టం చేయాలని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
హత్య కేసును ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో విచారించి నిందితులకు అత్యంత కఠినమైన శిక్షగా ఉరిశిక్ష విధించాలని వారు కోరారు. అలాగే నిందితుల ఆస్తులను జప్తు చేసి బాధిత కుటుంబానికి అప్పగించాలని డిమాండ్ చేశారు.
ఉషారాణి కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలవాలని, బాధిత కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం అందించడంతో పాటు కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని ఆదివాసీ సంఘాల ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.
ఈ ఘటనపై త్వరితగతిన న్యాయం జరిగేలా ప్రభుత్వం, సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని నిరసనకారులు హెచ్చరించారు.








