ఆరుట్ల, రంగారెడ్డి జిల్లా: తెలంగాణ భవిష్యత్ పునర్నిర్మాణం అద్దాల మేడల్లో కాదని, తరగతి గదుల్లోనే రూపుదిద్దుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. విద్యార్థులపై ప్రభుత్వం చేస్తున్న వ్యయం ఖర్చు కాదని, రాష్ట్ర భవిష్యత్తు కోసం చేస్తున్న పెట్టుబడని ఆయన స్పష్టం చేశారు. విద్య ఒక్కటే జీవితాలను సమూలంగా మార్చగల శక్తి కలిగిన సాధనమని పేర్కొన్నారు.
రంగారెడ్డి జిల్లా ఆరుట్ల గ్రామంలో ఏర్పాటు చేసిన తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను బుధవారం ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులు కూడా భవిష్యత్తులో ప్రధాని, ముఖ్యమంత్రి, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, డాక్టర్లు, ఇంజినీర్లు, న్యాయవాదులు, ప్రజాప్రతినిధులు కావచ్చని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదవడాన్ని ఎవరూ చిన్నచూపు చూడవద్దని సూచించారు.
తెలంగాణ పబ్లిక్ స్కూల్ రాష్ట్రవ్యాప్తంగా విద్యా రంగానికి ఆదర్శంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేసిన సీఎం, విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం ఏటా రూ.27 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తోందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రపంచస్థాయి విద్యా వ్యవస్థల వరకు అధ్యయనం చేసి విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి సమగ్ర నివేదిక సమర్పించారని, ఆ నివేదిక ఆధారంగానే తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ల ఆలోచనకు రూపకల్పన చేశామని వెల్లడించారు.
నాణ్యమైన విద్య అందరికీ అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో ఆరుట్ల గ్రామాన్ని ఎంపిక చేసి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. పాఠశాలలో ప్రవేశాల కోసం భారీ స్థాయిలో దరఖాస్తులు రావడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. “నో అడ్మిషన్స్” బోర్డు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి రావడం ఉపాధ్యాయులు, సిబ్బంది కృషికి నిదర్శనమని ప్రశంసించారు.
నిజాం పాలన, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆరుట్ల కమలాదేవి వంటి మహనీయుల స్ఫూర్తి ఉన్న నేలపై ఈ పాఠశాలను ప్రారంభించడం తనకు గర్వకారణమని సీఎం తెలిపారు. వారి పోరాట స్ఫూర్తి నేటి విద్యార్థుల్లోనూ కనిపించాలని ఆకాంక్షించారు.
విద్యతో పాటు నైపుణ్యాల అభివృద్ధి కూడా అత్యవసరమని పేర్కొన్న రేవంత్ రెడ్డి, యువతలో ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అక్కడ శిక్షణ పొందిన యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయని చెప్పారు.
క్రీడల అభివృద్ధికి కూడా ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని సీఎం వెల్లడించారు. ఆరుట్ల విద్యార్థులు ఫుట్‌బాల్‌లో ప్రదర్శించిన ప్రతిభను ప్రశంసించిన ఆయన, క్రీడల్లో తెలంగాణను అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. యువ క్రీడాకారులకు స్ఫూర్తినిచ్చేలా ప్రపంచ ప్రఖ్యాత ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీని హైదరాబాద్‌కు తీసుకురావడానికి ప్రయత్నించినట్లు వెల్లడించారు. త్వరలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా ప్రారంభిస్తామని ప్రకటించారు.
సమాజంలో కులవివక్షను తగ్గించేందుకు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌ను ఏర్పాటు చేస్తున్నామని సీఎం తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న ప్రతిభను ప్రభుత్వ పాఠశాలల ద్వారానే వెలికితీసే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. విద్యార్థులకు అత్యుత్తమ వసతులు, నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
అంతకుముందు పాఠశాల ప్రాంగణాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు. తరగతి గదులు, వసతి సౌకర్యాలు, ఇతర మౌలిక వసతులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయులతో ముచ్చటించి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.









