పాకాల (తిరుపతి జిల్లా): తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండల పరిధిలోని పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై బుధవారం మధ్యాహ్నం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గాదంకి గ్రామం సమీపంలోని ఫారెస్ట్ చెక్‌పోస్ట్ ఎదుట ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూరు నుంచి ప్లైవుడ్ లోడుతో శ్రీకాళహస్తి సమీపంలోని చింపేడు గ్రామంలోని కట్టెల ఫ్యాక్టరీకి వెళ్తున్న లారీ (ఏపీ 39 యూఎఫ్ 4356) డ్రైవర్ షేక్ బాజీ బాబా బుధవారం మధ్యాహ్నం 12.55 గంటల సమయంలో ఎలాంటి హెచ్చరిక సూచికలు ఇవ్వకుండా జాతీయ రహదారిపై ఒక్కసారిగా వాహనాన్ని నిలిపివేశాడు.
అదే సమయంలో యాదమర్రి మండలం పెరుమాలపల్లి గ్రామం నుంచి తిరుపతిలో జరుగుతున్న బంధువుల వివాహ వేడుకకు వెళ్తున్న ప్రయాణికులతో కూడిన ఆటో (ఏపీ 39 యూబి 1993) ముందున్న లారీని గమనించేలోపే వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ప్రమాదం తీవ్రతకు ఆటో పూర్తిగా ధ్వంసమైంది.
ఈ ప్రమాదంలో తవణంపల్లి మండలం ఏనుగుంటపల్లి గ్రామానికి చెందిన యనమల మాధవి (40), ఆమె కుమార్తె మేఘన (15) అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన వారిని స్థానికులు, పోలీసులు వెంటనే అంబులెన్స్‌ల ద్వారా తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు.
అక్కడ చికిత్స పొందుతూ యాదమర్రి మండలం పెరుమలపల్లి గ్రామానికి చెందిన పులకింటి రాజశేఖర్ (25), పులకింటి బేబీ (50) పరిస్థితి విషమించి మృతి చెందారు. దీంతో ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది.
ప్రమాదంలో గాయపడిన పులకింటి నవీన్ (14), కొమ్ము విష్ణు (19), యనమల సూరి (17), పులకింటి చిన్నబ్బ (50), పులకింటి రఘు (55), చాముండేశ్వరి (30)తో పాటు ఆటో డ్రైవర్ పులకింటి సుబ్రమణ్యం (50) ప్రస్తుతం రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం, ఎలాంటి ఇండికేటర్లు వేయకుండా వాహనాన్ని అకస్మాత్తుగా నిలిపివేయడమే ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఘటనపై బాధితుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ విషాద ఘటనతో మృతుల స్వగ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. వివాహ వేడుకకు వెళ్తూ ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.








