contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

16 పాస్‌పోర్టులు.. 245 దేశాలు.. బెన్నీ ప్రసాద్ అద్భుత ప్రయాణం

బెంగళూరుకు చెందిన సంగీతకారుడు బెన్నీ ప్రసాద్ ప్రపంచ యాత్రికుడిగానూ అరుదైన ఘనత సాధించి ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారారు. ప్రపంచంలోని 245 దేశాలు, ప్రాంతాలను కేవలం ఆరు సంవత్సరాల ఆరు నెలల 22 రోజుల్లో సందర్శించి ప్రపంచ రికార్డు నెలకొల్పిన ఆయన, తన ప్రయాణానికి సాక్ష్యంగా 16 భారతీయ పాస్‌పోర్టులను చూపించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వీసాలు, ఇమ్మిగ్రేషన్ స్టాంపులతో పూర్తిగా నిండిపోయిన పాస్‌పోర్టులను ఒక్కొక్కటిగా చూపిస్తూ తన సుదీర్ఘ ప్రయాణ విశేషాలను ఆయన పంచుకోవడంతో నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

‘మోస్ట్ ట్రావెల్డ్ పీపుల్’ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో విడుదలైన వీడియోలో బెన్నీ ప్రసాద్ తన ప్రయాణంలో ఎదురైన అనుభవాలను వివరించారు. అంటార్కిటికా సహా ఆరు ఖండాల్లోని దేశాలను సందర్శించిన ఆయన, ప్రతి దేశానికి వీసాలు పొందడం, అవసరమైన పత్రాలను సిద్ధం చేయడం ఎంతటి సవాలో వివరించారు. “నేను భారతీయుడిని. ఆరు సంవత్సరాల ఆరు నెలల 22 రోజుల్లో 245 దేశాలను సందర్శించాను” అని ఆయన పేర్కొన్నారు. ఎన్నో దేశాల ఎంట్రీ స్టాంపులు, వీసాలతో నిండిపోయిన పాస్‌పోర్టులు ఆయన సాధించిన ఘనతకు నిదర్శనంగా నిలిచాయి.

ఈ వీడియోకు సోషల్ మీడియాలో విశేష స్పందన లభిస్తోంది. “భారత్ నుంచి వచ్చిన నిజమైన ట్రావెల్ లెజెండ్” అంటూ పలువురు ప్రశంసిస్తుండగా, మరికొందరు “ఇన్ని దేశాలకు ప్రయాణించడమే కాకుండా, వీసాలు, పేపర్‌వర్క్ పూర్తి చేయడం ఎంత కష్టమో ఊహించలేం” అంటూ కామెంట్లు చేస్తున్నారు.

అయితే బెన్నీ ప్రసాద్ కథ కేవలం ప్రపంచ యాత్రతో మాత్రమే పరిమితం కాదు. 1975 ఆగస్టు 6న బెంగళూరులో జన్మించిన ఆయన చిన్నప్పటి నుంచే తీవ్రమైన ఆస్తమాతో బాధపడ్డారు. కార్టిసోన్ స్టెరాయిడ్ల వినియోగం కారణంగా రుమటాయిడ్ ఆర్థరైటిస్ బారిన పడి, ఊపిరితిత్తుల్లో 60 శాతం వరకు దెబ్బతిన్నాయి. రోగనిరోధక శక్తి కూడా బలహీనపడింది. చదువులో రాణించాలని కుటుంబ సభ్యులు ఒత్తిడి చేసినా, అనారోగ్యం కారణంగా తీవ్ర నిరాశకు గురైన ఆయన 16 ఏళ్ల వయసులో ఆత్మహత్యకు కూడా ప్రయత్నించారు.

ఆ క్లిష్ట పరిస్థితుల్లో సంగీతమే ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. సంగీతం ద్వారా తనకు కొత్త ఆశ లభించిందని, దేవుడిపై విశ్వాసంతో జీవితాన్ని మళ్లీ ప్రారంభించానని బెన్నీ తన అనుభవాలను పంచుకుంటారు. “ఒకప్పుడు పనికిరానని భావించిన నేను ఇంత సాధించగలిగితే, ఈ ప్రపంచంలో ఎవరైనా తమ కలలను నిజం చేసుకోవచ్చు. నేను ఆ రోజు నా జీవితాన్ని ముగించకపోవడం వల్లే నేడు వేలాది మందికి స్ఫూర్తిగా నిలవగలుగుతున్నాను” అని ఆయన సందేశం ఎంతో మందికి ధైర్యాన్ని ఇస్తోంది.

ప్రస్తుతం బెన్నీ ప్రసాద్ ప్రతి ఏడాది 40 నుంచి 50 దేశాల్లో పర్యటిస్తూ తన సంగీత ప్రదర్శనలతో పాటు జీవిత కథను పంచుకుంటున్నారు. కష్టాలను జయించి అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఆయన ప్రయాణం ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందికి స్ఫూర్తినిస్తోంది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :