గన్నేరువరం, కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలం గునుకుల కొండాపూర్ గ్రామంలో వివాహ వేడుకలో యువకుడిపై దాడి చేసిన కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు.
ఎస్సై నరేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గత నెల 19వ తేదీన గునుకుల కొండాపూర్ గ్రామంలో జరిగిన పెండ్లి భరత్ కార్యక్రమంలో ఇల్లంతకుంట గ్రామానికి చెందిన బోలుమల్ల అజయ్‌పై కొందరు దాడికి పాల్పడ్డారు. బాధితుడి ఫిర్యాదు మేరకు అదే రోజు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
దర్యాప్తులో భాగంగా కేసులో నిందితులుగా ఉన్న ఏ1 లింగంపల్లి రాకేష్ (గునుకుల కొండాపూర్), ఏ2 గుండా అజయ్ (గునుకుల కొండాపూర్), ఏ3 లింగంపల్లి శివ (గునుకుల కొండాపూర్), ఏ4 దొమ్మటి అజయ్ (గునుకుల కొండాపూర్), ఏ5 కళ్లెం సాయికుమార్ (గుండ్లపల్లి) లను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు.
అనంతరం నిందితులను మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా, వారికి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో వారిని జిల్లా జైలుకు తరలించినట్లు ఎస్సై నరేందర్ రెడ్డి వెల్లడించారు. కేసుకు సంబంధించిన దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.








