తిరుపతి జిల్లా, పాకాల : రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న మామిడి సబ్సిడీ పథకాల అమలులో అక్రమాలు జరుగుతున్నాయంటూ తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని పాకాల మండలం దామలచెరువు పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు దళారులు, వ్యాపారులు తక్కువ ధరకు లభించే ‘నీలం’ రకం మామిడికాయలను కొనుగోలు చేసి, ప్రభుత్వ సబ్సిడీ పొందేందుకు వాటిని ‘తోతాపురి’ రకంగా చూపిస్తూ తప్పుడు బిల్లులు సృష్టిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
స్థానికంగా జరుగుతున్న క్షేత్రస్థాయి పరిశీలనల్లో ఈ అంశం వెలుగులోకి వచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం అందించే సబ్సిడీలను అక్రమంగా పొందేందుకు కొందరు దళారులు అమాయక రైతుల పేర్లను వినియోగిస్తూ, నిబంధనలకు విరుద్ధంగా లారీల ద్వారా ఇతర మార్కెట్లు, బెంగళూరు వంటి నగరాలకు మామిడి లోడ్లను తరలిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
మార్కెట్‌లో ఒక రకమైన మామిడిని విక్రయిస్తూ, బిల్లుల్లో మాత్రం ‘తోతాపురి’గా నమోదు చేసి సబ్సిడీలను క్లెయిమ్ చేస్తున్నారని, ప్రతి రోజు ఒక్కో ర్యాంప్ వద్ద మూడు నుంచి నాలుగు లారీల వరకు ఇలాంటి లావాదేవీలు జరుగుతున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి.
ఈ వ్యవహారంపై ఉద్యానవన, వ్యవసాయ శాఖల పర్యవేక్షణ లోపించిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రజాధనంతో అమలు చేస్తున్న పథకాలలో అక్రమాలు చోటుచేసుకోకుండా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేయాలని, ఉన్నతాధికారులు విచారణ జరిపి వాస్తవాలను వెలికితీయాలని స్థానికులు, రైతు సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు.
ఆరోపణలను ఖండించిన ఉద్యాన అధికారిణి
ఈ ఆరోపణలపై స్పందించిన పాకాల మండల ఉద్యాన అధికారిణి శైలజ మాట్లాడుతూ, మార్కెట్‌లో లారీల లోడింగ్, అన్‌లోడింగ్ ప్రక్రియను శాఖ అధికారులు మొదటి నుంచి నిశితంగా పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ప్రతి లారీ నంబర్‌ను నమోదు చేసి, యాప్‌లో నమోదయ్యే వివరాలను లారీ కాటా బరువుతో సరిపోల్చి పూర్తిస్థాయిలో పరిశీలిస్తున్నామని చెప్పారు.
బరువులో వ్యత్యాసం ఉన్నా, నమోదైన వివరాలు సరిపోలకపోయినా సంబంధిత దరఖాస్తులను వెంటనే తిరస్కరిస్తామని ఆమె స్పష్టం చేశారు. కలెక్టరేట్ స్థాయిలో ప్రత్యేక బృందాలు కూడా ఈ వివరాలను రెండు నుంచి మూడు దఫాలు పరిశీలిస్తున్నాయని తెలిపారు. ఎలాంటి తప్పుడు సమాచారం ఆధారంగా సబ్సిడీలు పొందడం సాధ్యం కాదని, పూర్తి స్థాయి పరిశీలన అనంతరమే అర్హులైన రైతులకు సబ్సిడీలు మంజూరు చేస్తామని ఉద్యాన అధికారిణి శైలజ వివరించారు.
అయితే, మార్కెట్‌లో జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలికితీయాలని రైతులు, ప్రజాసంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.








