కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా: కాగజ్‌నగర్ పట్టణ ప్రజల సమస్యల పరిష్కారం, మౌలిక సదుపాయాల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తోందని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ అన్నారు. పట్టణంలోని 17వ వార్డులో స్థానిక ప్రజల ఎన్నో ఏళ్ల డిమాండ్ మేరకు చేపట్టిన నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఆయన భూమిపూజ చేసి శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దండే విఠల్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజా సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మౌలిక వసతులను విస్తృతంగా అభివృద్ధి చేస్తూ ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.
సీసీ రోడ్డు నిర్మాణ పనులను నాణ్యతలో ఎలాంటి రాజీ లేకుండా చేపట్టాలని, నిర్ణీత గడువులోపు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లకు ఎమ్మెల్సీ సూచించారు. ప్రజాధనం వినియోగంలో పారదర్శకత పాటిస్తూ పనులను సమర్థవంతంగా నిర్వహించాలని ఆయన ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో కాగజ్‌నగర్ మున్సిపల్ చైర్మన్ షాహిన్ సుల్తానా, కౌన్సిలర్ ఎమ్మాజీ శారద, మున్సిపల్ కమిషనర్ తిరుపతి, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, 17వ వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తమ వార్డులో రోడ్డు సౌకర్యం మెరుగుపడనున్నందుకు స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.








