పెద్దపల్లి జిల్లా, గోదావరిఖని: గోదావరిఖని పట్టణంలోని సప్తగిరి కాలనీలో ఉన్న మహాత్మా పూలే రెసిడెన్షియల్ పాఠశాలలో శనివారం రామగుండం ట్రాఫిక్ సీఐ బీ. రాజేశ్వర్ రావు ఆధ్వర్యంలో ట్రాఫిక్ అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు ట్రాఫిక్ నియమాలు, రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనాలు నడిపే సమయంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, వాహనానికి సంబంధించిన పత్రాలు, ఫిట్‌నెస్, లైట్లు, బ్రేకులు తదితర అంశాలు సక్రమంగా ఉండేలా చూసుకోవాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలను పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించడంతో పాటు ప్రాణాలను కాపాడుకోవచ్చని విద్యార్థులకు వివరించారు.
విద్యార్థులు చిన్నప్పటి నుంచే రహదారి భద్రతపై అవగాహన పెంపొందించుకోవాలని, కుటుంబ సభ్యులకు కూడా ట్రాఫిక్ నిబంధనల ప్రాముఖ్యతను తెలియజేయాలని ట్రాఫిక్ అధికారులు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో రామగుండం ట్రాఫిక్ ఎస్‌ఐ జి. హరిశేఖర్‌తో పాటు ట్రాఫిక్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.








