contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

జీవో 396 రద్దు చేయాలని పాకాలలో డాక్యుమెంట్ రైటర్ల పెన్‌డౌన్

పాకాల ,తిరుపతి జిల్లా : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించి జారీ చేసిన జీవో నెంబర్ 396 (G.O.Ms.No.396)ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పాకాలలో డాక్యుమెంట్ రైటర్లు రెండు రోజుల పెన్‌డౌన్ సమ్మె చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం పిలుపు మేరకు ఆదివారం ప్రారంభమైన ఈ ఆందోళన సోమవారం కూడా కొనసాగనుంది.

సమ్మెలో భాగంగా పాకాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో డాక్యుమెంట్ రైటర్లు విధులను బహిష్కరించి, ఆన్‌లైన్ సేవలు, దస్తావేజుల రచన ప్రక్రియలను నిలిపివేశారు. అనంతరం తమ ప్రధాన డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని పాకాల సబ్ రిజిస్ట్రార్ రహ్మతుల్లాకు అందజేశారు.

ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ, జీవో 396 ద్వారా ప్రభుత్వం తీసుకొస్తున్న నూతన విధానాలు దశాబ్దాలుగా జీవనోపాధిగా కొనసాగుతున్న డాక్యుమెంట్ రైటర్ల వ్యవస్థను నిర్వీర్యం చేసేలా ఉన్నాయని ఆరోపించారు. ఈ నిర్ణయంతో వేలాది మంది డాక్యుమెంట్ రైటర్లు, స్టాంపు వెండర్లు, డీటీపీ ఆపరేటర్ల ఉపాధి ప్రమాదంలో పడుతుందని, వారి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటుతో పాటు శాఖ సేవలను ప్రైవేటీకరించడం వల్ల సాధారణ ప్రజలు, ముఖ్యంగా చట్టపరమైన అవగాహన లేని నిరక్షరాస్యులు మోసపోయే అవకాశాలు పెరుగుతాయని నాయకులు పేర్కొన్నారు. దస్తావేజుల తయారీలో పొరపాట్లు జరిగితే ప్రజల ఆస్తుల భద్రతకే ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం వెంటనే జీవో నెంబర్ 396ను పూర్తిగా రద్దు చేయాలని, ప్రజల ఆస్తులకు పూర్తి భద్రత కల్పించాలని, రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటును నిలిపివేయాలని, రిజిస్ట్రేషన్ శాఖ సేవలను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరించకూడదని సంఘం డిమాండ్ చేసింది. అలాగే డాక్యుమెంట్ రైటర్ల లైసెన్సులను వెంటనే పునరుద్ధరించి, డాక్యుమెంట్ రైటర్లు, స్టాంపు వెండర్లు, డీటీపీ ఆపరేటర్ల ఉపాధికి భరోసా కల్పించాలని కోరింది.

“మీ ఆస్తుల భద్రతే మా లక్ష్యం – మా ధ్యేయం” అని పేర్కొన్న సంఘం నాయకులు, ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను పరిగణనలోకి తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో పాకాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలోని డాక్యుమెంట్ రైటర్స్ అసోసియేషన్ సభ్యులు, స్టాంపు వెండర్లు, డీటీపీ ఆపరేటర్లు మరియు పలువురు కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని సమ్మెకు మద్దతు తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :