తిరుపతి: ‘మావిగన్’ (త్రీ-సిటీ మెగా రీజియన్) రాజధాని ప్రతిపాదనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. ఈ అంశంపై పార్టీ నేతలు వైసీపీని వీడుతున్నారంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని, ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన అనుచరులు కలిసి చేస్తున్న కుట్రపూరిత ప్రచారమని ఆరోపించారు.
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 77వ జయంతి సందర్భంగా తిరుపతిలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడిన పెద్దిరెడ్డి, మావిగన్ ప్రతిపాదన రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి దోహదపడే కీలక ప్రణాళిక అని పేర్కొన్నారు.
మచిలీపట్నం, గుంటూరు, కృష్ణా జిల్లాలతో పాటు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఈ త్రీ-సిటీ మెగా రీజియన్ ఎంతో ఉపయోగపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. “మావిగన్ ప్రతిపాదనపై అసంతృప్తి ఉంటే అది ప్రజల్లో కాదు… చంద్రబాబులో మాత్రమే ఉంది. ప్రజల నుంచి మాత్రం దీనికి పూర్తి మద్దతు లభిస్తోంది” అని అన్నారు.
అమరావతి ప్రాజెక్టుపై కూడా పెద్దిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. అమరావతి పేరుతో వేల కోట్ల రూపాయల అప్పులు తెచ్చి వాటిని ప్రజలకు ప్రయోజనం చేకూరని విధంగా ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. భారీ అప్పులతో రాష్ట్ర భవిష్యత్తును భారంగా మారుస్తున్నారని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
ఇటీవల రాజకీయంగా చర్చనీయాంశంగా మారిన యూట్యూబర్ ‘రావణ్’ వ్యవహారంపైనా ఆయన స్పందించారు. రావణ్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఆయన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను ప్రశ్నించారని, ఆ విషయంపై వైసీపీ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు.
చిత్తూరు జిల్లాలో ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ సజావుగానే సాగుతోందని పేర్కొన్న పెద్దిరెడ్డి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో మాత్రం తమకు కొన్ని అనుమానాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా వైఎస్ రాజశేఖరరెడ్డిని స్మరించుకున్న ఆయన, ప్రజల కోసమే జీవించిన అసలైన ప్రజానాయకుడు వైఎస్‌ఆర్ అని కొనియాడారు. ఆయన భౌతికంగా లేకపోయినా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. ఆరోగ్యశ్రీ, జలయజ్ఞం, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి సంక్షేమ, అభివృద్ధి పథకాలు తెలుగు రాష్ట్రాల్లోని లక్షలాది నిరుపేదల జీవితాల్లో మార్పు తీసుకొచ్చాయని గుర్తు చేశారు.








