అమరావతి: యూట్యూబర్ రావణ్ అరెస్ట్ వ్యవహారంపై మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) సీనియర్ నేత కొడాలి నాని రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై కొత్త చట్టాలను ప్రయోగించి జైళ్లకు పంపుతున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలను అణచివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు.
మీడియాతో మాట్లాడుతూ, “ఈ రాష్ట్రంలో ఎవరైనా ప్రభుత్వాన్ని ప్రశ్నించినా, విమర్శించినా కొత్త కొత్త చట్టాలు తెచ్చి జైలుకు పంపిస్తున్నారు. ప్రజల నోరు నొక్కేందుకు కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది” అని విమర్శించారు. యూట్యూబర్ రావణ్‌పై తీవ్ర చట్టాలను ప్రయోగించడాన్ని ఎద్దేవా చేస్తూ, “ఉప్మా చట్టం, ఇడ్లీ చట్టం అంటూ ఏదో ఒక కొత్త చట్టం తీసుకొచ్చి జైలుకు పంపించారు” అంటూ వ్యాఖ్యానించారు.
వైసీపీని ‘గొడ్డలి పార్టీ’గా అభివర్ణిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్, వారి అనుకూల మీడియాపై కూడా కొడాలి నాని మండిపడ్డారు. “మాది గొడ్డలి పార్టీ కాదు.. పేదల సంక్షేమం కోసం పనిచేసే పార్టీ. నిజానికి ఇది ‘బూడిద ప్రభుత్వం’ అని ప్రజలే మాట్లాడుకుంటున్నారు. మీకు వ్యతిరేకంగా ఉన్నవారిని వేధించడం, అణచివేయడం మీ ప్రభుత్వ లక్షణంగా మారింది. చివరకు మీకు మిగిలేది కూడా బూడిదేనని” ఘాటుగా వ్యాఖ్యానించారు.
రావణ్ చేసిన వ్యాఖ్యలు కొత్తవేమీ కావని, గతంలో ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులుగా పనిచేసిన నాయకులు కూడా అంతకంటే తీవ్రస్థాయిలో రాజకీయ విమర్శలు చేశారని కొడాలి నాని అన్నారు. గత ఏడాది నుంచి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై రావణ్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నాడని, అదే కారణంగా జనసేన కార్యకర్తలు అతనిపై కేసులు నమోదు చేసి వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు.
కోర్టులు బెయిల్ మంజూరు చేసిన తర్వాత కూడా ప్రత్యేక చట్టాలను ప్రయోగించి రావణ్‌ను మళ్లీ జైలుకు పంపారని ఆయన విమర్శించారు. “మేము అధికారంలో ఉన్నప్పుడు జగన్‌పై, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా మీద కూడా రావణ్ విమర్శలు చేశాడు. అయినా మేమెప్పుడూ అతన్ని అణచివేయాలని ప్రయత్నించలేదు” అని పేర్కొన్నారు.
రావణ్‌ను వైసీపీకి చెందిన వ్యక్తిగా చిత్రీకరించేందుకు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న మీడియా ప్రయత్నిస్తోందని కూడా కొడాలి నాని ఆరోపించారు. రావణ్ గతంలో చంద్రబాబు, లోకేశ్, బాలకృష్ణలపై విమర్శలు చేయలేదని, అయితే కొన్ని మీడియా సంస్థల యాజమాన్యాలపై విమర్శలు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఇప్పుడు అదే మీడియా తప్పుడు ప్రచారం చేస్తూ రావణ్ వ్యవహారాన్ని వైసీపీతో ముడిపెట్టే ప్రయత్నం చేస్తోందని ఆయన విమర్శించారు.
యూట్యూబర్ రావణ్ అరెస్ట్ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసిన నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి. పోలీసులు చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నామని చెబుతుండగా, ప్రతిపక్షం మాత్రం దీనిని భావ ప్రకటనా స్వేచ్ఛపై దాడిగా అభివర్ణిస్తోంది.








