విజయవాడ : మండలి వెంకట కృష్ణారావు శతజయంతి ఉత్సవాల సందర్భంగా కృష్ణా జిల్లా విజయవాడలో నిర్వహించిన 2026 మూడవ అంతర్జాతీయ తెలుగు రచయితల మహాసభలు అత్యంత వైభవంగా ముగిశాయి. జూలై 11, 12 తేదీల్లో కేబీఎన్ కళాశాల ప్రాంగణంలో జరిగిన ఈ మహాసభల్లో తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతికి విశిష్ట సేవలు అందిస్తున్న రచయితలు, కవులు, పరిశోధకులను ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా అధికార ప్రతినిధి, అధ్యాపకురాలు, కవయిత్రి, రచయిత్రి శ్రీమతి కనుమూరి రాజ్యలక్ష్మి (గద్దె అనంతలక్ష్మి) కి మూడవ అంతర్జాతీయ ప్రపంచ తెలుగు మహాసభల ప్రతినిధిగా గౌరవ పురస్కారం అందజేశారు. ప్రముఖుల చేతుల మీదుగా ఈ పురస్కారం అందుకోవడం తనకు గర్వకారణమని రాజ్యలక్ష్మి తెలిపారు.
మహాసభల్లో మహిళా చర్చాగోష్టులు, సాహిత్య సదస్సులు, కవి సమ్మేళనాలు, భాషా పరిరక్షణపై చర్చలు ఘనంగా నిర్వహించగా, దేశ విదేశాల నుంచి వచ్చిన సాహితీవేత్తలు, భాషా ఉద్యమకారులు, పరిశోధకులు, కవయిత్రులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి. జ్యోతిర్మయి, ప్రముఖ రచయిత్రి వోల్గా, పద్మశ్రీ ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ప్రముఖ రచయిత్రి బోయి హైమావతి భీమన్న, ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్మన్ రాయపాటి శైలజ, ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక అకాడమీ చైర్మన్ పొడపాటి తేజస్విని, కృష్ణా జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు గుత్తికొండ సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జి.వి. పూర్ణచంద్తో పాటు వేలాది మంది సాహితీవేత్తలు, రచయితలు, కవులు, పరిశోధకులు పాల్గొన్నారు.
తెలుగు భాషాభివృద్ధి, సాహిత్య వికాసం, భావితరాలకు తెలుగు సంస్కృతిని చేరవేయడంలో ఇటువంటి మహాసభలు కీలక పాత్ర పోషిస్తాయని వక్తలు పేర్కొన్నారు. కనుమూరి రాజ్యలక్ష్మికి లభించిన ఈ గౌరవ పురస్కారం ఆమె సాహిత్య సేవలకు గుర్తింపుగా నిలిచిందని పలువురు అభినందించారు.








