కాకినాడ: గ్రేటర్ కాకినాడ విస్తరణ, విలీన ప్రక్రియ, కార్పొరేషన్ ఎన్నికల విషయంలో ప్రభుత్వం ఇకపై జాప్యం చేయకుండా వెంటనే అధికారిక ప్రకటన విడుదల చేయాలని కాకినాడ పౌర సంక్షేమ సంఘం కన్వీనర్, ప్రముఖ సామాజిక వేత్త దూసర్లపూడి రమణరాజు డిమాండ్ చేశారు. చట్టపరమైన నిర్లక్ష్యం, ప్రభుత్వాల మీనమేషాల కారణంగా చారిత్రాత్మక కాకినాడ నగరం తీవ్రంగా నష్టపోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
రమణరాజు మాట్లాడుతూ, 1866లో కేవలం 25 వేల జనాభాతో ఏర్పడిన కాకినాడ మున్సిపాలిటీ ప్రస్తుతం సుమారు 5.5 లక్షల జనాభాకు చేరుకున్నప్పటికీ నగర విస్తీర్ణాన్ని పెంచకపోవడం వల్ల కొత్త టౌన్‌షిప్‌ల అభివృద్ధికి అవకాశం లేకుండా పోయిందన్నారు. ఫలితంగా కాకినాడ అభివృద్ధి పరంగా “మరుగుజ్జు నగరం”గా మారిపోయిందని విమర్శించారు.
గ్రేటర్ కాకినాడ విస్తరణకు సంబంధించిన అంశం కోర్టు కేసుల కారణంగా ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉండిపోయిందని, ప్రభుత్వం తక్షణమే సాంకేతిక సమస్యలను పరిష్కరించి వార్డుల విభజన పూర్తి చేసి ఎన్నికలకు మార్గం సుగమం చేయాలని కోరారు. ఈ మేరకు స్పష్టమైన అధికారిక ప్రకటన విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల జాప్యం వల్ల కాకినాడ నగరం, విలీన గ్రామాలు కేంద్ర ప్రభుత్వ నిధులను భారీగా కోల్పోతున్నాయని రమణరాజు పేర్కొన్నారు. గత మూడేళ్లలో కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ రూ.30 కోట్ల కేంద్ర ఆర్థిక సంఘం నిధులను కోల్పోయిందని, వచ్చే మార్చి (2027) నాటికి మరో రూ.10 కోట్ల నిధులు కూడా కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
అలాగే గత 13 ఏళ్లుగా ఎన్నికలు జరగని తూరంగి, ఇంద్రపాలెం, వలసపాకల, వాకలపూడి, రమణయ్యపేట, చీడిగ గ్రామాలు కలిపి సుమారు రూ.120 కోట్ల అభివృద్ధి నిధులను కోల్పోయాయని తెలిపారు. ప్రజాప్రతినిధులు లేకపోవడం, నిధుల కొరత కారణంగా జిల్లా కేంద్రమైన కాకినాడలో మౌలిక వసతుల అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు.
గతంలో నిర్వహించిన కుల గణనతో పాటు ప్రస్తుతం ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే వివరాలను ఆధారంగా తీసుకుని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళల రిజర్వేషన్లను శాస్త్రీయంగా రూపొందించి కోర్టు ముందు సమర్పించాలని సూచించారు. తద్వారా పెండింగ్‌లో ఉన్న న్యాయపరమైన, సాంకేతిక అడ్డంకులను తొలగించి విలీన ప్రక్రియను వేగవంతం చేయవచ్చని అభిప్రాయపడ్డారు.
భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని కాకినాడకు సమీపంలోని 24 గ్రామాలను గ్రేటర్ కాకినాడలో విలీనం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అయితే మొదటి దశలో ఇప్పటికే 13 ఏళ్లుగా విలీనం కోసం ఎదురుచూస్తున్న ఆరు గ్రామాల ప్రక్రియను పూర్తి చేసి, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు (మార్చి 2027) గ్రేటర్ కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు.
కేంద్ర జనాభా లెక్కల పేరుతో మరింత కాలయాపన చేస్తే ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి ప్రభుత్వ వ్యతిరేకతగా మారే అవకాశముందని రమణరాజు హెచ్చరించారు. ఇప్పటికైనా మున్సిపల్ పరిపాలన శాఖ, జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకుని గ్రేటర్ కాకినాడ విస్తరణ, విలీన గ్రామాల అంశం, కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణపై స్పష్టమైన అధికారిక ప్రకటన విడుదల చేయాలని ఆయన గట్టిగా డిమాండ్ చేశారు.








