contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

మహిళ హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు : జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు

మెదక్/తూప్రాన్ : ఒంటరిగా సంచరించే మహిళను ఆభరణాల కోసం దారుణంగా హత్య చేసిన కేసులో నిందితుడికి జిల్లా న్యాయస్థానం జీవిత ఖైదుతో పాటు రూ.25 వేల జరిమానా విధించినట్లు మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు. ఈ కేసులో నిందితుడికి శిక్ష పడేలా సమర్థవంతంగా దర్యాప్తు నిర్వహించిన పోలీసు అధికారులు, సిబ్బందిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

ఎస్పీ వెల్లడించిన వివరాల ప్రకారం.. నర్సాపూర్ పట్టణానికి వచ్చిన బుజలి అనే మహిళతో కేతావత్ గోపాల్ పరిచయం పెంచుకుని ఆమె నమ్మకాన్ని సంపాదించాడు. అనంతరం ఆమెను ఆటోలో శ్రీనివాస వైన్స్‌కు తీసుకెళ్లి మద్యం కొనుగోలు చేయించాడు. అక్కడి నుంచి నర్సాపూర్ శివారులోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి మద్యం సేవించిన అనంతరం, మహిళ మెడలో ఉన్న బంగారు ఆభరణాలపై కన్నేసిన నిందితుడు వాటిని దోచుకోవాలనే ఉద్దేశంతో ఆమెను హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యాడు.

మహిళ ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు 2025 మార్చి 25న నర్సాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అప్పటి ఎస్‌ఐ లింగం మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు మహిళతో కలిసి వెళ్లిన ఆటోను గుర్తించి, డ్రైవర్‌ను విచారించారు. అతను చూపించిన ప్రాంతంలో గాలింపు చేపట్టగా అటవీ ప్రాంతంలో కుళ్లిన స్థితిలో ఉన్న మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేసును హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు.

అప్పటి నర్సాపూర్ సీఐ జాన్‌రెడ్డి శాస్త్రీయ, సాంకేతిక ఆధారాలను సేకరించి నిందితుడిని అరెస్టు చేసి పటిష్టమైన ఛార్జ్‌షీట్‌ను కోర్టులో దాఖలు చేశారు. విచారణ సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెంకటేష్ సమర్థవంతంగా వాదనలు వినిపించారు. కేసులో సమర్పించిన సాక్ష్యాధారాలు, సాక్షుల వాంగ్మూలాలను సమగ్రంగా పరిశీలించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి నీలిమ నిందితుడు కేతావత్ గోపాల్‌పై నేరం రుజువైందని నిర్ధారించి, అతనికి జీవిత ఖైదుతో పాటు రూ.25 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.

ఈ కేసు దర్యాప్తులో లైజనింగ్ అధికారి ఎస్‌ఐ విఠల్, కానిస్టేబుల్ రవీందర్ గౌడ్, సీడీఓ హరిబాబు గౌడ్ కీలకంగా సహకరించారు. పక్కా ఆధారాలను సేకరించి నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన అప్పటి దర్యాప్తు అధికారి సీఐ జాన్‌రెడ్డి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెంకటేష్, లైజనింగ్ బృందం, అలాగే కేసు దర్యాప్తులో పాల్గొన్న పోలీసు అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు అభినందించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :