contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

మెట్‌పల్లి కాల్పుల కేసు ఛేదించిన పోలీసులు

జగిత్యాల : జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో తీవ్ర కలకలం రేపిన గోనెల లక్ష్మిపై కాల్పుల కేసును పోలీసులు ఛేదించారు. ఆస్తి కోసం సొంత వదినను హత్య చేయాలని కుట్ర పన్ని, ఉత్తరప్రదేశ్‌కు చెందిన వ్యక్తితో సుపారీ హత్యాయత్నానికి పాల్పడిన నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా ప్రధాన షూటర్‌ను ఉత్తరప్రదేశ్‌లో అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.

ఆస్తి వివాదమే హత్యాయత్నానికి కారణం

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మెట్‌పల్లి పోచమ్మవాడకు చెందిన గోనెల శంకర్ అలియాస్ జేసీబీ శంకర్ (A-1), అతని అన్న రాజం కుటుంబాల మధ్య కొంతకాలంగా ఆస్తి వివాదాలు కొనసాగుతున్నాయి. కుటుంబానికి చెందిన 58 గుంటల భూమి, నివాస గృహాన్ని శంకర్ తన భార్య అనూష (A-2) పేరిట అక్రమంగా బదిలీ చేయించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంపై రాజం భార్య గోనెల లక్ష్మి తన వాటా కోరుతూ ప్రశ్నించడంతో ఇరు కుటుంబాల మధ్య విభేదాలు మరింత తీవ్రంగా మారాయి.

లక్ష్మిని అడ్డు తొలగిస్తే ఆస్తి మొత్తం తమకే దక్కుతుందని భావించిన శంకర్, అతని భార్య అనూష, బంధువు గోపి ముత్తయ్య (A-3) కలిసి హత్యకు పక్కా ప్రణాళిక రూపొందించినట్లు దర్యాప్తులో తేలింది.

సౌదీకి పంపిస్తామని ఆశ చూపి సుపారీ

కుట్రలో భాగంగా తమ వద్ద జేసీబీ డ్రైవర్‌గా పనిచేస్తున్న ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు చెందిన సచిన్ వర్మ (A-4)ను ఎంపిక చేశారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అతడికి భారీ మొత్తంలో డబ్బు ఇవ్వడంతో పాటు సౌదీ అరేబియాకు పంపిస్తామని ఆశ చూపి హత్యకు ఒప్పించినట్లు పోలీసులు తెలిపారు.

ఈ ఏడాది మార్చిలో ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమం సమీపంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి నుంచి రూ.40 వేలకుపైగా వెచ్చించి దేశీయ నాటు పిస్టల్, మూడు సజీవ తూటాలు కొనుగోలు చేసినట్లు వెల్లడైంది. ఇందుకోసం శంకర్ ఫోన్‌పే ద్వారా రూ.35 వేల నగదు పంపించినట్లు ఆర్థిక లావాదేవీల ద్వారా పోలీసులు గుర్తించారు.

విఫలమైన హత్యాయత్నం

పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు దోపిడీ దొంగల దాడిగా చిత్రీకరించేలా పథకం రచించారు. వేసవిలో ఇంటి బయట నిద్రించే అలవాటు ఉన్న లక్ష్మిని కాల్చి చంపాలని నిర్ణయించారు. జూన్ 13న చేసిన తొలి ప్రయత్నం విఫలమైంది.

అనంతరం జూన్ 15 అర్ధరాత్రి సుమారు 1.30 గంటలకు ముసుగు ధరించిన సచిన్ వర్మ మోటార్‌సైకిల్‌పై వచ్చి నిద్రిస్తున్న లక్ష్మిపై కాల్పులు జరిపాడు. అయితే బుల్లెట్ లక్ష్యాన్ని తప్పి ఆమె ఎడమ చెంపకు తగలడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.

బుల్లెట్‌తో కేసుకు కీలక మలుపు

ఘటన అనంతరం శంకర్‌కు ఏమీ తెలియనట్లు ప్రవర్తించగా, షూటర్ సచిన్ ఉత్తరప్రదేశ్‌కు పారిపోయాడు. అయితే బాధితురాలికి నిర్వహించిన శస్త్రచికిత్సలో బుల్లెట్ బయటపడటంతో కేసు కీలక మలుపు తిరిగింది. సాంకేతిక ఆధారాలు, కాల్ డేటా రికార్డులు, సీసీటీవీ ఫుటేజీలు, ఆర్థిక లావాదేవీలను విశ్లేషించిన పోలీసులు కుట్రను పూర్తిగా వెలికితీశారు.

నలుగురు అరెస్ట్.. ఆయుధాలు స్వాధీనం

దర్యాప్తులో భాగంగా ఇప్పటికే గోనెల శంకర్, అనూష, గోపి ముత్తయ్యలను అరెస్ట్ చేసిన పోలీసులు.. తాజాగా ప్రధాన నిందితుడు సచిన్ వర్మను ఉత్తరప్రదేశ్‌లో అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుడి వద్ద నుంచి ఒక నాటు పిస్టల్, రెండు సజీవ తూటాలు, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మెట్‌పల్లి డీఎస్పీ ఎ. రాములు పర్యవేక్షణలో సీఐ బి. సురేష్ బాబు, ఎస్‌ఐ పి. కిరణ్ కుమార్ నేతృత్వంలోని దర్యాప్తు బృందం అంతర్రాష్ట్ర స్థాయిలో విచారణ జరిపి ఈ క్లిష్టమైన కేసును విజయవంతంగా ఛేదించింది. కేసును సమర్థవంతంగా దర్యాప్తు చేసిన పోలీసు బృందాన్ని డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

ఈ ఘటనలో క్షణికావేశం, ఆస్తిపై వ్యామోహం కుటుంబ బంధాలను మరిచిపోయేలా చేసి హత్యాయత్నం వరకు దారితీసిందని పోలీసులు పేర్కొన్నారు. పక్కా ప్రణాళికతో నేరానికి పాల్పడి పోలీసులను తప్పుదోవ పట్టించాలని చూసిన నిందితులు చివరకు చట్టం ముందు చిక్కి జైలుపాలయ్యారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :