జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. పెద్దపూర్లోని ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ రథయాత్రలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు.
ప్రత్యేక పూజలు, అర్చనల అనంతరం పట్టణంలోని అయ్యప్పస్వామి దేవాలయం సమీపం నుంచి ప్రారంభమైన రథయాత్ర కొత్త బస్టాండ్, పాత బస్టాండ్, బస్ డిపో మీదుగా మహాలక్ష్మీ దేవాలయం వరకు కొనసాగింది. యాత్ర సాగిన మార్గమంతా భక్తులు హారతులు ఇస్తూ, పూలతో స్వాగతం పలికారు.
భక్తులు స్వామివారి రథాన్ని భక్తి శ్రద్ధలతో లాగుతూ “హరే కృష్ణ హరే కృష్ణ… కృష్ణ కృష్ణ హరే హరే… హరే రామ హరే రామ… రామ రామ హరే హరే” అంటూ హరినామ సంకీర్తనలు చేశారు. రథం ముందు భజనలు, నృత్యాలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పారు.
ఈ సందర్భంగా ఇస్కాన్ టెంపుల్ ప్రతినిధులు మాట్లాడుతూ, శ్రీ జగన్నాథ స్వామి రథయాత్రకు విశిష్టమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉందన్నారు. ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకోలేని భక్తుల వద్దకే జగన్నాథుడు ఈ రథయాత్ర రూపంలో విచ్చేస్తాడని, అందుకే ప్రతి ఒక్కరూ స్వామివారి దర్శనం చేసుకుని దైవానుగ్రహం పొందాలని కోరారు.
రథయాత్రలో మహిళలు, యువత, చిన్నారులు, వృద్ధులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి భావంతో స్వామివారిని దర్శించుకున్నారు. మెట్పల్లి పట్టణంలో రథయాత్ర సందర్భంగా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది.








