పాకాల : పాకాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలో దస్తావేజు లేఖరులు, స్టాంప్ వెండర్లు గత ఐదు రోజులుగా సమ్మె నిర్వహిస్తున్నప్పటికీ, కార్యాలయ సేవలు ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగుతున్నాయని పాకాల సబ్ రిజిస్ట్రార్ రహ్మతుల్లా స్పష్టం చేశారు.
రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన ప్రజలు దస్తావేజు లేఖరులు అందుబాటులో లేరనే కారణంతో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. రిజిస్ట్రేషన్ కోసం వచ్చే వారు నేరుగా సబ్ రిజిస్ట్రార్‌ను లేదా కార్యాలయ సిబ్బందిని సంప్రదిస్తే, అవసరమైన ప్రక్రియను పూర్తి చేసి రిజిస్ట్రేషన్ సేవలు అందిస్తామని వెల్లడించారు.
అదేవిధంగా కార్యాలయం ద్వారా అందించే ఇతర కీలక సేవలు కూడా యథావిధిగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్ (ఈసీ) జారీ, ధృవీకరించిన కాపీలు (సీసీ) జారీ, స్టాంపుల విక్రయం తదితర సేవలు ఎలాంటి అంతరాయం లేకుండా ప్రజలకు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.
సమ్మె కారణంగా సేవలు నిలిచిపోయాయని ఎలాంటి అపోహలకు లోనుకావద్దని, అవసరమైన సేవల కోసం ప్రజలు నిరభ్యంతరంగా పాకాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని సంప్రదించి ప్రభుత్వ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సబ్ రిజిస్ట్రార్ రహ్మతుల్లా విజ్ఞప్తి చేశారు.








