contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

కూటమి ప్రభుత్వంలో ‘మెగా’ డీఎస్సీ కాదు – నిరుద్యోగుల గొంతు కోసే ‘దగా’ డీఎస్సీ!

  • తిరుపతిలో పోటెత్తిన నిరుద్యోగ యువత – హోరెత్తిన నిరసన ర్యాలీ!
  • అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలి!
  • నీట్ తరహాలోనే డీఎస్సీ అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలి: వైఎస్ఆర్సిపి విద్యార్థి విభాగం డిమాండ్.
  • ర్యాలీకి సంఘీభావం తెలిపిన మాజీ మంత్రి ఆర్.కే. రోజా

 

తిరుపతి :వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు, వైఎస్ఆర్సిపి విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి సూచనలతో జిల్లా కేంద్రమైన తిరుపతిలో యువత, విద్యార్థి లోకం గళమెత్తింది. కూటమి ప్రభుత్వం చేపట్టిన డీఎస్సీ నియామకాల్లో ఘోరమైన అక్రమాలు, అవకతవకలు జరిగాయంటూ నిర్వహించిన భారీ నిరసన ర్యాలీకి విశేష స్పందన లభించింది. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం రెండవ గేటు నుండి అంబేద్కర్ విగ్రహం వరకు విద్యార్థులు, యువకులు కదం తొక్కుతూ భారీ ర్యాలీగా తరలివెళ్లారు. “డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయాలి… నిరుద్యోగుల భవిష్యత్తుతో చెలగాటం ఆడొద్దు… అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలి” అంటూ చేసిన నినాదాలతో తిరుపతి వీధులు హోరెత్తాయి. ఈ కార్యక్రమానికి నగరి నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి ఆర్.కే. రోజా హాజరై నిరసనకు పూర్తి సంఘీభావం ప్రకటించారు. చంద్రగిరి, తిరుపతి నియోజకవర్గాల నుండి విద్యార్థి, యువజన నాయకులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.

నీట్ తరహాలోనే లోకేష్ రాజీనామా చేయాలి:
ఈ సందర్భంగా వైఎస్సార్ విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ బి. ఓబుల్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. “కేంద్రంలో నీట్ పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎలాగైతే విమర్శలు ఎదుర్కొన్నారో, అదే రీతిలో రాష్ట్రంలో డీఎస్సీ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలి. డీఎస్సీ పేరుతో లక్షలాది మంది నిరుద్యోగుల కష్టాన్ని, వారి భవిష్యత్తును కూటమి ప్రభుత్వం బజార్న పెట్టింది. ఈ కుంభకోణంలో నిజాలు బయటకు రావాలంటే తక్షణమే సిబిఐ విచారణకు ఆదేశించాలి” అని స్పష్టం చేశారు.

అన్ని రంగాల్లోనూ కూటమి ప్రభుత్వం ఘోర వైఫల్యం:
అధికారంలోకి వచ్చాక యువతకు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ నెరవేర్చకుండా కూటమి ప్రభుత్వం దారుణంగా మోసం చేసిందని నాయకులు మండిపడ్డారు. నెలకు ₹3,000 ఇస్తామని చెప్పి నిరుద్యోగ యువతను దారుణంగా వంచించారన్నారు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ నీటిమూటగా మారిందన్నారు. విద్యార్థుల చదువులకు ఆసరాగా నిలిచే పథకానికి కోతలు విధించి దెబ్బకొట్టారు.

యూనివర్సిటీల ప్రక్షాళన పేరుతో ద్రోహం:
వర్సిటీ అధ్యాపకుల నియామకాల్లో అర్హతల పేరుతో కుదింపులకు పాల్పడి ఉన్నత విద్యను నాశనం చేస్తున్నారన్నారు. ఇది ‘మెగా డీఎస్సీ’ కాదని, నిరుద్యోగుల జీవితాలను ముంచే ‘దగా డీఎస్సీ’ అని నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయకపోతే, రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగ సమరాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి, యువజన విభాగాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో నిరుద్యోగ అభ్యర్థులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :