కాకినాడ: ఆగస్ట్ 1న శనివారం నాడు స్వయంభు కాకినాడ భోగి గణపతి పీఠంలో 222 వ సంకష్ట హార చతుర్ధి పూజోత్సవం జరుగుతుందని పీఠం ఉపాసకులు రమణరాజు తెలిపారు. పీఠం ఏర్పడి 6,773 రోజులు కాగా 969 వారాలుగా నిత్య సోమవారం పూజలు ప్రత్యేకంగా జరిగాయని పేర్కొన్నారు.
చతుర్ధి ఉపవాసకులు ఉదయం వేళలో పీఠం మాడ వీధుల్లో కాలి నడకన నలుదిక్కులా అష్ట దిక్పాలకుల ఆరాధన నిర్వహించుకుని, సృష్టి ఆరంభంలో తొలి పూజ చేసిన మంగళాంబికను ఇక్కడి వేప చెట్టుగా భావించి పూజించి, రాత్రి వేళ చంద్రోదయంలో అర్ఘ్యం సమర్పించి జ్వాలా తోరణం దర్శించి, మరుసటి రోజు స్వయంపాకం అందిస్తారన్నారు.
చతుర్ధి ఉపవాసాన్ని ఆరోగ్యవంతులైన యువతీ యువకులు చేయడం వలన సంకల్ప బలం, సహనం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయన్నారు. చంద్రుని గమనం భూమిపై ఉన్న జలాశయాలనే కాకుండా, మానవ శరీరంలోని నీటి శాతాన్ని, రక్తం, మెదడు కణాలను ప్రభావితం చేస్తుందని, పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి తిథి నాటికి మనస్సులో చంచలత్వం పెరిగే అవకాశం ఉంటుందని, ఈ సమయంలో ఉపవాసం, ధ్యానం చేయడం వల్ల మెదడు ప్రశాంతంగా మారి, భావోద్వేగాలు నియంత్రణలో ఉంటాయన్నారు.
వినాయకుడు విఘ్నాధిపతి కావడం వలన చతుర్ధి రోజున చేసే ఉపవాస పూజ వల్ల జీవితంలో ఎదురయ్యే ఆర్థిక, ఆరోగ్య, మానసిక అడ్డంకులు తొలగిపోతాయన్నారు. సౌభాగ్య సిద్ధి కోసం ప్రతి కుటుంబం జీవితంలో ఒక్కసారైనా చతుర్ధి వ్రతం చేయాలన్నారు.








