అనకాపల్లి : అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం బుచ్చింపేట పంచాయతీ పరిధిలోని దళిత కాలనీలో తాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చడంతో కుల వ్యవస్థ వ్యతిరేక పోరాట కమిటీ (కేవీపీఎస్), ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఖాళీ బిందెలతో బిక్షాటన నిర్వహించి, అనంతరం ధర్నా చేపట్టారు.
గ్రామంలోని దళిత కాలనీలో సుమారు 58 కుటుంబాలు నివసిస్తున్నప్పటికీ, తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీలో ఉన్న రెండు బోర్లలో వచ్చే నీరు కలుషితమై ఉండటంతో ఆ నీటిని తాగడానికి వీలులేకపోతోందని తెలిపారు. దీంతో కొందరు తమ సొంత ఇళ్లలో బోర్లు వేసుకున్న వారి వద్ద నుంచి నీటిని తెచ్చుకుని, రెండు రోజుల పాటు నిల్వ చేసుకుని తాగాల్సిన దయనీయ పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న జల్ జీవన్ మిషన్, అమృత ధార వంటి పథకాల ప్రయోజనాలు ఇప్పటికీ దళిత కాలనీకి అందకపోవడం తీవ్ర అన్యాయమని నాయకులు విమర్శించారు. మంచినీటి కోసం వ్యవసాయ కూలి పనులు మానుకుని గంటల తరబడి తిరగాల్సిన పరిస్థితి దళిత కుటుంబాలకు ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 78 సంవత్సరాలు పూర్తయినా దళితులకు కనీస తాగునీటి సౌకర్యం కల్పించకపోవడం ప్రభుత్వాల వైఫల్యానికి నిదర్శనమని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ఈ. చిరంజీవి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కే. గోవిందరావు మాట్లాడుతూ, దళిత కాలనీ తాగునీటి సమస్యను తక్షణమే శాశ్వతంగా పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమస్యను నిర్లక్ష్యం చేస్తే త్వరలోనే మండల కార్యాలయం ఎదుట భారీ ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బి. అప్పలనరస, దూడి సత్యవతి, డోకల సత్యవతి, అనకాపల్లి రాజులమ్మ తదితరులు పాల్గొని ఉద్యమానికి మద్దతు తెలిపారు.








