- ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందో .. భయాందలో వైద్యులు
- గోడలు తడిసి కరెంట్ షాక్
- కనీస సౌకర్యాలు లేవు ..
- గోడలు తడిసి కూలిపోయే ప్రమాదం ఉంది
గోదావరిఖని : పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలోని పాత మున్సిపల్ కార్యాలయం సమీపంలో ఉన్న ఏరియా వెటర్నరీ ఆస్పత్రి శిథిలావస్థకు చేరుకుంది. భవనం ప్రమాదకరంగా మారినా అధికారులు పట్టించుకోవడం లేదని వైద్య సిబ్బంది, పశుపాలకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఆస్పత్రికి ప్రతిరోజూ సుమారు 80 నుంచి 100 వరకు పెంపుడు కుక్కలు, పిల్లులు, మేకలు, ఇతర మూగజీవాలు టీకాలు, చికిత్స కోసం వస్తుంటాయి. అయితే సరైన మౌలిక వసతులు, సిబ్బంది లేకపోవడంతో పశువైద్య సేవలు అందించడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని సిబ్బంది తెలిపారు.

ఆస్పత్రి భవనం గోడలు పూర్తిగా తడిసి నీరు కారుతున్నాయని, వర్షం కురిసిన ప్రతిసారీ గదుల్లోకి నీరు చేరుతుందని సిబ్బంది తెలిపారు. గోడలు బలహీనపడటంతో ఎప్పుడు కూలిపోతాయోనన్న భయం నెలకొంది. విద్యుత్ బోర్డుల నుంచి తీగలు బయటకు వేలాడుతుండటంతో నీరు తగిలి కరెంట్ షాక్ వచ్చే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లోనే వైద్య సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.

ఆస్పత్రిలో ఇద్దరు వెటర్నరీ అసిస్టెంట్లు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం ఒక్కరే విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. సిబ్బంది కొరత కారణంగా పశువులకు సకాలంలో చికిత్స అందించడం కష్టంగా మారిందని చెప్పారు. గతంలో ఇక్కడ పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీ) స్థాయి అధికారి బదిలీపై వెళ్లిన తర్వాత ఇప్పటివరకు కొత్త అధికారిని నియమించలేదని వెల్లడించారు.
ఆస్పత్రి ప్రాంగణంలో కనీసం మరుగుదొడ్డి కూడా లేకపోవడంతో మహిళా సిబ్బందితో పాటు ఇతర ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. గతంలో పనిచేసిన మహిళా అధికారి కూడా మరుగుదొడ్డి లేక సమీపంలోని ఇళ్లను ఆశ్రయించాల్సి వచ్చేదని సిబ్బంది పేర్కొన్నారు. మందులను భద్రపరిచేందుకు కూడా తగిన గదులు, సౌకర్యాలు లేవని తెలిపారు.
ప్రమాదకరంగా మారిన ఈ భవనంలో విధులు నిర్వహించడం సిబ్బంది ప్రాణాలకు ముప్పుగా మారిందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే అవసరమైన సిబ్బందిని నియమించడంతో పాటు కొత్త వెటర్నరీ ఆస్పత్రి భవనం నిర్మించాలని కోరుతున్నారు. కొత్త భవనం పూర్తయ్యే వరకు ఆస్పత్రిని సురక్షితమైన ప్రత్యామ్నాయ భవనానికి తరలించాలని ప్రభుత్వాన్ని, సంబంధిత అధికారులను విజ్ఞప్తి చేస్తున్నారు.









