మెదక్: రోడ్డు ప్రమాదాల నివారణతో పాటు ప్రమాద బాధితుల ప్రాణాలను కాపాడడంలో జాతీయ రహదారుల వెంట ఉన్న ఢాబాలు, హోటళ్లు, రెస్టారెంట్ల యాజమాన్యం కీలక భాగస్వాములు కావాలని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, ఐపీఎస్ పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో హైవే వెంబడి ఉన్న హోటళ్లు, ఢాబాలు, రెస్టారెంట్ల యాజమానులతో నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడారు.
రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే గోల్డెన్ అవర్‌లో అందించే తక్షణ వైద్య సహాయం ఎంతో కీలకమని ఎస్పీ పేర్కొన్నారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే 100, 112 లేదా 108కు సమాచారం ఇచ్చి, క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించేలా హోటళ్ల యాజమాన్యం చొరవ చూపాలని సూచించారు. హోటల్ సిబ్బందికి ప్రథమ చికిత్స (ఫస్ట్ ఎయిడ్), సీపీఆర్‌పై అవగాహన కల్పించి, అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించేలా శిక్షణ ఇవ్వాలని కోరారు.
జిల్లాలో సుమారు 255 కిలోమీటర్ల మేర ఏడు జాతీయ రహదారులు ఉండటంతో రోజూ వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయని ఎస్పీ తెలిపారు. ముఖ్యంగా భారీ వాహనాల డ్రైవర్లు 8 నుంచి 10 గంటల పాటు నిరంతరాయంగా వాహనాలు నడపడం వల్ల అలసటకు గురై స్టీరింగ్‌పైనే నిద్రపోయి ప్రమాదాలకు గురవుతున్నారని పేర్కొన్నారు. అలసిపోయిన డ్రైవర్లను గుర్తించి కొంతసేపు విశ్రాంతి తీసుకునేలా ప్రోత్సహించాలని, పూర్తిగా అప్రమత్తమైన తర్వాతే ప్రయాణాన్ని కొనసాగించేలా చూడాలని హోటల్ యాజమాన్యానికి సూచించారు.
“ప్రతి రోడ్డు ప్రమాదం వెనుక ఒక కుటుంబం ఉంటుంది. ఒక తల్లి తన కుమారుడిని, ఒక భార్య తన భర్తను, పిల్లలు తమ తండ్రిని కోల్పోతారు. ఒక్క క్షణం నిర్లక్ష్యం జీవితాంతం మానని గాయాన్ని మిగులుస్తుంది. అందుకే రోడ్డు భద్రతను ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా భావించాలి” అని ఎస్పీ భావోద్వేగంగా పేర్కొన్నారు.
రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం రాహత్ (PM RAHAT) పథకం కింద రూ.1.5 లక్షల వరకు నగదు రహిత (క్యాష్‌లెస్) వైద్య చికిత్స అందుబాటులో ఉందని తెలిపారు. అలాగే ప్రమాద బాధితులను గోల్డెన్ అవర్‌లో ఆసుపత్రికి చేర్చి ప్రాణాలు కాపాడిన వారికి కేంద్ర ప్రభుత్వ ‘రాహ్‌వీర్ (Rah-Veer)’ పథకం కింద రూ.25 వేల నగదు ప్రోత్సాహకం అందజేస్తారని వివరించారు. గుడ్ సమారిటన్ మార్గదర్శకాల ప్రకారం సహాయం చేసిన వారికి చట్టపరమైన పూర్తి రక్షణ ఉంటుందని, ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావని స్పష్టం చేశారు.
హైవే వెంబడి ఉన్న ప్రతి హోటల్, ఢాబాలో వాహనాల పార్కింగ్‌కు తగిన స్థలం ఉండేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ సూచించారు. పార్కింగ్ సౌకర్యం లేక జాతీయ రహదారులపై భారీ వాహనాలు నిలిపివేయడం వల్ల ప్రమాదాల ప్రమాదం పెరుగుతుందని పేర్కొన్నారు. వాహనాలను క్రమబద్ధంగా పార్కింగ్ చేయించేందుకు ప్రతి హోటల్లో ప్రత్యేకంగా ఒక సిబ్బందిని నియమించాలని సూచించారు. అలాగే కనీసం నాలుగు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి, అవి నిరంతరం పనిచేసేలా చూడాలని ఆదేశించారు.
హోటళ్లకు వచ్చే మహిళల భద్రత విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని, మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ కార్యకలాపాలు, అనుమానాస్పద వ్యక్తుల సంచారంపై అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. అనుమానాస్పద ఘటనలు గుర్తించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
“ప్రతి హోటల్ ఒక రోడ్డు భద్రతా కేంద్రంగా మారాలి. అలసటతో ఉన్న డ్రైవర్లకు విశ్రాంతి కల్పించడం, ప్రమాద బాధితులను గోల్డెన్ అవర్‌లో ఆసుపత్రికి చేర్చడం, మహిళల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వడం, మాదకద్రవ్యాలు, అక్రమ కార్యకలాపాలను అరికట్టడంలో పోలీసులకు సహకరించడం ద్వారా అనేక విలువైన ప్రాణాలను కాపాడవచ్చు” అని ఎస్పీ పేర్కొన్నారు.
ఈ సమావేశంలో మెదక్ అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, ఎక్సైజ్ సూపరింటెండెంట్, డీఎస్పీలు ప్రసన్న కుమార్, నరేందర్ గౌడ్, ఏఎంవీఐ, సీఐలు రంగా కృష్ణ, సందీప్ రెడ్డి, వెంకట రాజా గౌడ్, రాజశేఖర్ రెడ్డి, రేణుక, మహేష్, కృష్ణమూర్తితో పాటు జిల్లాలోని హైవే వెంబడి ఉన్న హోటళ్లు, ఢాబాలు, రెస్టారెంట్ల యాజమానులు పాల్గొన్నారు.








