- తిరుపతి జిల్లా పాకాల పంచాయతీలో అధ్వానంగా మారిన పారిశుధ్యం
- రోడ్లను ఆక్రమించిన దుకాణాలు, పాదాచారుల హక్కులకు భంగం
తిరుపతి జిల్లా, పాకాల : తిరుపతి జిల్లా పాకాల మండల కేంద్రమైన పాకాల పంచాయతీలో అధికారుల నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం పరాకాష్టకు చేరింది. స్థానిక సత్తెమ్మ గుడి వీధిలో గత నెల రోజులుగా మురుగు కాలువలు పూడికకూరుకుపోయి, కాలువ నీరు ఉప్పొంగి రోడ్డుపై పారుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. మురుగు నీరు నిలిచిపోయి తీవ్ర దుర్గంధం వెదజల్లుతుండటంతో స్థానిక ప్రజలు, వ్యాపారులు, వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.
పాకాలలో ఫుట్పాత్ ఏది? ఆక్రమణల మయం!
పాకాల పంచాయతీ పరిధిలో జానా మోరా స్థలాలను సైతం ఆక్రమించుకొని వ్యాపారాలు సాగిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కనీసం నడవడానికి ఫుట్పాత్ కూడా లేకపోవడంతో పాదాచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దుకాణదారులు రోడ్లపైకి వచ్చి ఆక్రమణలకు పాల్పడుతున్నా, అడ్డగోలుగా ఆటో స్టాండ్లు ఏర్పాటు చేసుకుని ట్రాఫిక్కు ఆటంకం కలిగిస్తున్నా అధికారులు ‘మామూళ్ల’ మత్తులో జోగుతున్నారని స్థానికులు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు.
పన్నులు వసూలు చేయడంలో ఉన్న శ్రద్ధ.. సౌకర్యాల్లో ఏది?
లక్షల రూపాయల రోడ్డు టాక్సులు, పంచాయతీ పన్నులు కడుతున్న ప్రజలకు కనీస మౌలిక వసతులు కల్పించడంలో యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. పార్కింగ్ సౌకర్యం లేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే, అధికారులు మాత్రం చూసీచూడనట్లు వ్యవహరించడం వెనుక ఉన్న మతలబు ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అధికారుల అండదండలతోనే ఈ అక్రమాలు, ఆక్రమణలు సాగుతున్నాయని వీధివాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వెంటనే చర్యలు తీసుకోకపోతే నిరసన తప్పదు!
నెల రోజులుగా మురుగు నీరు రోడ్డుపైనే పారుతున్నందున దోమలు వ్యాపించి రోగాలు బారినపడే ప్రమాదం ఉందని సత్తెమ్మ గుడి వీధి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, సత్తెమ్మ గుడి వీధిలో పారిశుధ్య పనులు చేపట్టి, రోడ్లపై ఆక్రమణలను తొలగించాలని, లేనిపక్షంలో పంచాయతీ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తున్నారు.








