గన్నేరువరం, కరీంనగర్ జిల్లా : గన్నేరువరం మండలంలోని ఖాసింపేట్ గ్రామానికి చెందిన కయ్యం సంపత్ అనే వ్యక్తిని అరెస్టు చేసి మంగళవారం కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచినట్లు గన్నేరువరం పోలీసులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భూ వివాదానికి సంబంధించి కయ్యం సంపత్ గత నెల 20న గన్నేరువరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అయితే కేసు విచారణ కొనసాగుతున్న సమయంలో తనకు ఆశించిన విధంగా న్యాయం జరగడం లేదని భావించిన సంపత్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
ఈ క్రమంలో ఆత్మహత్య చేసుకుంటానంటూ పోలీసులను బెదిరించడంతో పాటు, పోలీస్ శాఖ ప్రతిష్టకు భంగం కలిగించేలా వాట్సాప్ గ్రూపులు మరియు ఇతర సోషల్ మీడియా వేదికల్లో అసత్య ప్రచారాలు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు.
అంతేకాకుండా సోమవారం సాయంత్రం గన్నేరువరం పోలీస్ స్టేషన్‌కు వచ్చి విధి నిర్వహణలో ఉన్న పోలీసు సిబ్బందిని అడ్డుకోవడంతో పాటు విధులకు ఆటంకం కలిగించేలా ప్రవర్తించినట్లు పేర్కొన్నారు.
దీంతో ప్రభుత్వ ఉద్యోగుల విధి నిర్వహణకు ఆటంకం కలిగించడం, బెదిరింపులకు పాల్పడటం తదితర ఆరోపణలపై కయ్యం సంపత్‌పై చట్టరీత్యా కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం మంగళవారం ఆయనను కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా, తదుపరి న్యాయపరమైన చర్యలు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.








