contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

అట్రాసిటీ కేసుపై కరీంనగర్ రూరల్ ఏసీపీ విచారణ

గన్నేరువరం, కరీంనగర్ జిల్లా: కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో ఇటీవల చోటుచేసుకున్న ఘర్షణకు సంబంధించిన ఎస్సీ, ఎస్టీ (అట్రాసిటీ నిరోధక) కేసుపై కరీంనగర్ రూరల్ డివిజన్ ఏసీపీ విజయ్‌కుమార్ బుధవారం విచారణ నిర్వహించారు. ఘటనకు సంబంధించిన పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించి, ఇరువర్గాల నుంచి వివరాలు సేకరించారు.

ఇటీవల గ్రామానికి చెందిన కుర్ర మనీషా, ఆమె భర్త హరీష్, కుటుంబ సభ్యులను అదే గ్రామానికి చెందిన బోయిని కుమార్, టేకు అనిల్ కులం పేరుతో దూషించారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గన్నేరువరం ఎస్సై నరేందర్ రెడ్డి ఫిర్యాదును స్వీకరించి నిందితులపై ఎస్సీ, ఎస్టీ (అట్రాసిటీ నిరోధక) చట్టంతో పాటు భారతీయ న్యాయ సంహిత (BNS)లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

అదే ఘటనకు సంబంధించి ఎదుటి వర్గం కూడా ఫిర్యాదు చేయడంతో, పోలీసులు ఆ ఫిర్యాదును సైతం నమోదు చేసి ఇరువర్గాల ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు చేపట్టారు. చట్టాన్ని ఎవరైనా అతిక్రమించినా ఉపేక్షించబోమని, శాంతిభద్రతలకు భంగం కలిగించే చర్యలను కఠినంగా అణచివేస్తామని పోలీసులు స్పష్టం చేశారు.

విచారణ అనంతరం గ్రామంలో కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాన్ని నిర్వహించిన ఏసీపీ విజయ్‌కుమార్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. గ్రామాల్లో పరస్పర సామరస్యం, శాంతిభద్రతలను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. చిన్న చిన్న విభేదాలను పెద్ద ఘర్షణలుగా మార్చకుండా చట్టబద్ధమైన మార్గాల్లో సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు.

ఈ సందర్భంగా పెరుగుతున్న సైబర్ నేరాలపై ప్రజలను అప్రమత్తం చేసిన ఏసీపీ, గుర్తు తెలియని ఫోన్ కాల్స్, ఆన్‌లైన్ లింకులు, పెట్టుబడి మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. గ్రామాల్లో కమ్యూనిటీ సీసీటీవీ కెమెరాల ఏర్పాటు ద్వారా నేరాల నియంత్రణతో పాటు శాంతిభద్రతల పరిరక్షణ మరింత బలోపేతం అవుతుందని తెలిపారు.

చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై, సామాజిక ఉద్రిక్తతలు సృష్టించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని ఏసీపీ విజయ్‌కుమార్, గన్నేరువరం ఎస్సై నరేందర్ రెడ్డి హెచ్చరించారు. ప్రజలు పోలీసులకు సహకరించి గ్రామంలో శాంతియుత వాతావరణాన్ని కొనసాగించాలని వారు విజ్ఞప్తి చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :