గోదావరిఖని : ఎన్టీపీసీ పర్మినెంట్ టౌన్షిప్లోని సెయింట్ క్లెయిర్ ఉన్నత పాఠశాలకు చెందిన పలువురు విద్యార్థులు రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపిక కావడం పాఠశాలకు మరో గర్వకారణంగా నిలిచింది. ఈ విషయాన్ని పాఠశాల ప్రిన్సిపల్ ఏ. డొమినిక్ తెలిపారు.
పెద్దపల్లి అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 2వ తేదీన నిర్వహించిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో సెయింట్ క్లెయిర్ పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించారు.
60 మీటర్ల పరుగు పందెంలో కృష్ణవేణి, ఆర్యన్, రిహాన్, హేమలత, మను ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యారు. వీరు ఈ నెల 7, 8 తేదీల్లో హనుమకొండలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను చాటుకోనున్నారు.
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపల్ ఏ. డొమినిక్ అభినందిస్తూ, రాష్ట్రస్థాయిలోనూ అత్యుత్తమ ప్రతిభ కనబర్చి పాఠశాలకు, ఎన్టీపీసీకి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు శిక్షణ అందించిన పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు రాజ్ కుమార్, శ్యాములు విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించి, రాష్ట్రస్థాయి పోటీల్లో విజయాలు సాధించాలని శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థుల విజయానికి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యం హర్షం వ్యక్తం చేశారు.








