గుంతకల్లు టౌన్: డీఎస్సీ నియామకాల్లో జరిగినట్లు ఆరోపిస్తున్న అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని వైఎస్సార్సీపీ గుంతకల్లు నియోజకవర్గ యువ నేత సీబీ మంజునాథ్ రెడ్డి డిమాండ్ చేశారు.
విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలు, డీఎస్సీ నియామకాలలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైఎస్సార్సీపీ గుంతకల్లు నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే వై. వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట కొనసాగుతున్న రెండో రోజు యువజన, బీసీ సెల్ నిరసన దీక్షలను శుక్రవారం సీబీ మంజునాథ్ రెడ్డి పూలమాలలు వేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డీఎస్సీ పరీక్షల కోసం ఏళ్ల తరబడి కష్టపడి సిద్ధమైన అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు. అర్హత లేకపోయినా, పరీక్షలు సరిగా రాయకపోయినా డబ్బుతో డీల్‌లు కుదుర్చుకుని కొందరు పోస్టులు పొందారని విమర్శించారు.
డీఎస్సీ అక్రమాలకు సంబంధించిన ఆధారాలను వైఎస్సార్సీపీ బహిర్గతం చేసినప్పటికీ, వాటిపై సమాధానం చెప్పాల్సిన అధికార పార్టీ నాయకులు ప్రజల దృష్టి మరల్చే రాజకీయాలకు పాల్పడుతున్నారని అన్నారు. డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైన తర్వాత నియామకాలకు సంబంధించిన మెరిట్ లిస్ట్‌ను ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు.
ఔట్సోర్సింగ్ ఉద్యోగికి తొలి ర్యాంక్ ఎలా వచ్చిందని, అనంతరం ఆ వివరాలను అధికారిక వెబ్సైట్ నుంచి ఎందుకు తొలగించారని నిలదీశారు. డీఎస్సీ నియామకాల ప్రక్రియలో జీవో నంబర్ 4, 47 అమల్లో ఉండగా, చివరి దశలో జీవో నంబర్ 56ను ఎందుకు తీసుకువచ్చారో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. నియామక ప్రక్రియ ప్రారంభంలో ఒక నిబంధన, ముగిసే సమయంలో మరో నిబంధన అమలు చేయడం వెనుక ఉద్దేశం ఏమిటో వెల్లడించాలని కోరారు.
విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. 2014లో “జాబు రావాలంటే బాబు రావాలి” అంటూ, 2024 ఎన్నికల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, లేకపోతే ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయలేదని ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శలు చేశారు.
25 నెలలుగా చెల్లించాల్సిన నిరుద్యోగ భృతిని లెక్కించి ప్రతి నిరుద్యోగికి రూ.75 వేల చొప్పున వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు, యువత, నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం అన్ని సంఘాలతో కలిసి ఉద్యమాలు కొనసాగిస్తామని, ప్రభుత్వ కేసులకు భయపడేది లేదని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుంతకల్లు పట్టణ, మండల అధ్యక్షులు, అనుబంధ విభాగాల నాయకులు, మాజీ కౌన్సిలర్లు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు, యువకులు, నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.








