contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల దోపిడీపై అజ్ఞాత ఫిర్యాదుల పోర్టల్ ఏర్పాటు చేయాలి

ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో పెరుగుతున్న ఫీజుల భారం, పుస్తకాలు, యూనిఫారాల పేరుతో జరుగుతున్న అక్రమ వసూళ్లపై తల్లిదండ్రులు ఎలాంటి భయాందోళనలు లేకుండా ఫిర్యాదు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి గోప్యతతో కూడిన ‘అనానిమస్ గ్రీవెన్స్ పోర్టల్’ను తక్షణమే ఏర్పాటు చేయాలని పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ దూసర్లపూడి రమణరాజు డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యాశాఖ నిబంధనలను ఉల్లంఘిస్తూ అనేక ప్రైవేట్ పాఠశాలలు ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచడమే కాకుండా, పాఠశాలల నుంచే పుస్తకాలు, యూనిఫారాలు కొనుగోలు చేయాలని తల్లిదండ్రులను బలవంతం చేస్తున్నాయని ఆరోపించారు. అయితే ఈ అక్రమాలపై ఫిర్యాదు చేయాలనుకున్నా, తమ వివరాలు బయటపడితే పిల్లలను పాఠశాల యాజమాన్యాలు మానసికంగా వేధించే అవకాశం ఉందనే భయంతో దాదాపు 90 శాతం మంది తల్లిదండ్రులు మౌనం పాటిస్తున్నారని తెలిపారు.

తల్లిదండ్రుల ఈ నిస్సహాయ పరిస్థితిని ఆసరాగా చేసుకుని కార్పొరేట్ విద్యాసంస్థలు ప్రతి ఏడాది ఫీజులను భారీగా పెంచుతున్నాయని ఆయన విమర్శించారు. ఈ పరిస్థితికి కేవలం హెచ్చరికలు లేదా నోటీసులు జారీ చేయడం ద్వారా పరిష్కారం లభించదని, సాంకేతిక ఆధారిత పటిష్ట వ్యవస్థను ప్రభుత్వం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.

ఢిల్లీ, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలను ఆదర్శంగా తీసుకుని ఆంధ్రప్రదేశ్‌లో కూడా పూర్తి గోప్యత కలిగిన ఆన్‌లైన్ ఫిర్యాదు వ్యవస్థను రూపొందించాలని రమణరాజు సూచించారు. ఫిర్యాదు చేసే తల్లిదండ్రుల పేరు, ఫోన్ నంబర్, విద్యార్థి వివరాలు వంటి వ్యక్తిగత సమాచారం పాఠశాల యాజమాన్యాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకుండా సాంకేతిక రక్షణ కల్పించాలని కోరారు.

అదేవిధంగా, అధిక ఫీజుల వసూళ్లు, డొనేషన్ల డిమాండ్లు, పుస్తకాల అక్రమ విక్రయాలకు సంబంధించిన ఆడియో, వీడియోలు, పత్రాలు వంటి ఆధారాలను నేరుగా అప్‌లోడ్ చేసే అవకాశం కూడా పోర్టల్‌లో ఉండాలని సూచించారు. ఒకే పాఠశాలపై ఎక్కువ సంఖ్యలో రహస్య ఫిర్యాదులు నమోదైతే విద్యాశాఖ ఉన్నతాధికారులు వెంటనే ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించిన యాజమాన్యాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రైవేట్ పాఠశాలల నియంత్రణ కోసం తీసుకురానున్న నూతన విధానంలో ఈ ‘అనానిమస్ గ్రీవెన్స్ పోర్టల్’ను తప్పనిసరిగా చేర్చాలని రమణరాజు కోరారు. ఇలాంటి వ్యవస్థ ద్వారానే మధ్యతరగతి, సామాన్య కుటుంబాలకు నిజమైన రక్షణ లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రతి సంవత్సరం నోటీసు బోర్డులు ఏర్పాటు చేయాలని ఇచ్చే ఆదేశాలతో సమస్యలు పరిష్కారం కావని, సాంకేతికంగా బలమైన ఫిర్యాదు వ్యవస్థ ద్వారానే ప్రైవేట్ పాఠశాలల ఇష్టారాజ్యానికి అడ్డుకట్ట వేయవచ్చని పేర్కొన్నారు. రాబోయే విద్యా సంవత్సరానికి ముందే ప్రభుత్వం ఈ వ్యవస్థను అమల్లోకి తీసుకురాకపోతే రాష్ట్రవ్యాప్తంగా తల్లిదండ్రులు, ప్రజా సంఘాలతో కలిసి పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టాల్సి వస్తుందని దూసర్లపూడి రమణరాజు హెచ్చరించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :