పల్నాడు జిల్లా రెంటచింతల మండలం రెంటాల గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం కన్వీనర్, మాజీ జెడ్పీటీసీ సభ్యులు నవులూరి భాస్కర్ రెడ్డి కుమారుడు నవులూరి చెన్నారెడ్డి హత్య రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఈ ఘటన జిల్లాలో కలకలం రేపగా, మృతుడి అంత్యక్రియలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ప్రముఖ నేతలు హాజరై ఘనంగా నివాళులర్పించారు.
మాచర్ల నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పార్టీ యువ నాయకుడు పిన్నెల్లి వెంకట రామిరెడ్డి చెన్నారెడ్డి పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ విషాదాన్ని తట్టుకునే ధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని ఆకాంక్షించారు.
అంత్యక్రియల్లో మాజీ పార్లమెంట్ సభ్యుడు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, నరసరావుపేట పార్లమెంట్ పరిశీలకుడు పూనూరు గౌతమ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కాసు మహేష్ రెడ్డి, యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాడిపత్రి చంద్రశేఖర్, ఎస్ఈసీ సభ్యుడు కొమ్మారెడ్డి చలమారెడ్డి, సత్తెనపల్లి నియోజకవర్గ ఇంచార్జ్ గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి, మాచర్ల నియోజకవర్గ పరిశీలకుడు కొమ్మినేని వెంకటేశ్వర్లు (కె.వి.), పెదకూరపాడు పరిశీలకుడు యొనుముల మురళీధర్ రెడ్డి, గురజాల నియోజకవర్గ పరిశీలకుడు పడాల శివారెడ్డి తదితరులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నివాళులర్పించారు.
ఇదిలా ఉండగా, శుక్రవారం తెల్లవారుజామున రెంటాల గ్రామ సమీపంలో చెన్నారెడ్డి అత్యంత దారుణంగా హత్యకు గురైనట్లు సమాచారం. గుర్తు తెలియని దుండగులు గొంతు కోసి హత్య చేసినట్లు ప్రాథమిక సమాచారం వెలువడింది. సంఘటన స్థలంలో ఆధారాలు చెదరగొట్టేందుకు కారం చల్లిన ఆనవాళ్లు కనిపించినట్లు స్థానికులు చెబుతున్నప్పటికీ, దీనిపై పోలీసులు అధికారికంగా ఎలాంటి నిర్ధారణ చేయలేదు.
ఈ హత్య రాజకీయ కక్షల నేపథ్యంలో జరిగిందా, వ్యక్తిగత విభేదాల ఫలితమా లేదా మరే ఇతర కారణాలున్నాయా అనే అంశాలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అసలు కారణం పోలీసుల దర్యాప్తులోనే తేలాల్సి ఉందని అధికారులు పేర్కొంటున్నారు.
సమాచారం అందుకున్న గురజాల డీఎస్పీ ఉమామహేశ్వరరావు, రెంటచింతల ఎస్సై నాగార్జున సంఘటన స్థలానికి చేరుకుని ఆధారాలను పరిశీలించారు. కుటుంబ సభ్యులు, స్థానికులను విచారించి వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
చెన్నారెడ్డి హత్యతో రెంటాల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రాజకీయ, సామాజిక వర్గాల్లో ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. హత్య వెనుక ఉన్న అసలు కారణాలను వెలికితీసేందుకు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.








