గోదావరిఖని: సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL)కు తాడిచర్ల బ్లాక్-2 (PKOC-2) డీప్‌సైడ్ కోల్ బ్లాక్ కేటాయించడంపై బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కందుల సంధ్యారాణి హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా హైదరాబాద్‌లో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన కందుల సంధ్యారాణి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శాలువాతో సత్కరించి, సింగరేణికి కొత్త బొగ్గు బ్లాక్ కేటాయించడంలో చొరవ చూపినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
సింగరేణి సంస్థకు కొత్త బొగ్గు బ్లాక్‌ల కేటాయింపు సంస్థ భవిష్యత్ విస్తరణకు, బొగ్గు ఉత్పత్తి సామర్థ్యం పెంపునకు దోహదపడుతుందని సంధ్యారాణి పేర్కొన్నారు. ముఖ్యంగా పెద్దపల్లి ప్రాంత అభివృద్ధికి ఈ నిర్ణయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆమె అన్నారు.
సింగరేణిని మరింత బలోపేతం చేయడంతో పాటు స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉందని తెలిపారు. కొత్త ప్రాజెక్టుల ద్వారా ఈ ప్రాంతంలో ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకుని ప్రజలకు మరిన్ని అవకాశాలు అందుబాటులోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
తాడిచర్ల బ్లాక్-2 (PKOC-2) డీప్‌సైడ్ కోల్ బ్లాక్ కేటాయింపు సింగరేణి సంస్థ భవిష్యత్ ప్రస్థానంలో కీలక ముందడుగుగా నిలుస్తుందని కందుల సంధ్యారాణి పేర్కొన్నారు. సంస్థ అభివృద్ధి, కార్మికుల సంక్షేమం, స్థానిక ప్రాంతాల ప్రగతికి ఇలాంటి నిర్ణయాలు మరింత దోహదపడాలని ఆమె ఆకాంక్షించారు.








