contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

కనిగిరిని కరువు మండలంగా ప్రకటించాలి

కనిగిరి: ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, కనిగిరి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో కరువు పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయని సీపీఐ కనిగిరి నియోజకవర్గ సహాయ కార్యదర్శి పందిటి మోహన్ అన్నారు. తక్షణమే ఆరు మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి, కరువు సహాయక చర్యలు చేపట్టాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

శుక్రవారం కనిగిరి ఎమ్మార్వో కార్యాలయం వద్ద సీపీఐ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, చేతివృత్తిదారుల సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం నియోజకవర్గాన్ని కరువు మండలాలుగా ప్రకటించాలని కోరుతూ డీటీకి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా పందిటి మోహన్ మాట్లాడుతూ.. వర్షాలు సకాలంలో కురవకపోవడంతో రైతులు పంటలు సాగు చేయలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. వర్షాభావం కారణంగా వ్యవసాయ పనులు లేకపోవడంతో కూలీలకు ఉపాధి దొరకడం కష్టంగా మారిందని తెలిపారు. దీంతో అనేక మంది కూలీలు పొట్టచేత పట్టుకుని ఇతర ప్రాంతాలు, రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.

కరువు పరిస్థితులను అధిగమించేందుకు ప్రభుత్వం తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. కరువు భృతి ప్రకటించడంతో పాటు, మార్కాపురం జిల్లాలోని 21 మండలాల్లో కరువు పనులు ప్రారంభించి, ఉపాధి హామీ పథకం కింద 200 రోజుల పని దినాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రతి కూలీకి రోజుకు రూ.600 కూలి అందేలా చర్యలు తీసుకోవాలని, పశువులకు దాణా అందించి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు మీరావలి, ఖాజావలి, బ్రహ్మం, యేసయ్య, శేషాద్రి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :