contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

భూ సమస్యలను పరిష్కరించాలి .. భూ పోరాట కమిటీ

హనుమంతునిపాడు: హనుమంతునిపాడు మండలంలోని హాజీపురం, మిట్టపాలెం ఉమ్మడి రెవెన్యూ పరిధిలో గత 25 సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని భూ పోరాట కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సమస్యలపై మార్కాపురం జిల్లా కలెక్టర్ ప్రత్యక్షంగా జోక్యం చేసుకుని విచారణ జరిపి, అర్హులైన భూమిలేని పేదలకు న్యాయం చేయాలని కమిటీ నాయకుడు బడుగు వెంకటేశ్వర్లు విజ్ఞప్తి చేశారు.

రెవెన్యూ అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ హనుమంతునిపాడు మండల కేంద్రంలో భూ పోరాట కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బడుగు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. గ్రామంలో నివాసం లేని వ్యక్తుల పేర్లతో మంజూరైనట్లు చెబుతున్న బినామీ అసైన్మెంట్ పట్టాలను రద్దు చేయాలని స్థానికులు ఎన్నో సంవత్సరాలుగా ఆందోళనలు, పోరాటాలు చేస్తున్నారని తెలిపారు.

హాజీపురం, మిట్టపాలెం పరిధిలో సుమారు 150 కుటుంబాలు భూమిలేని నిరుపేదలుగా ఉన్నాయని, అయితే గ్రామంలోనే కాకుండా మండలం, జిల్లాలో కూడా లేని వ్యక్తుల పేర్లతో కొందరు స్థానిక భూస్వాములు అక్రమంగా అసైన్మెంట్ పట్టాలు పొందారని కమిటీ నాయకులు ఆరోపించారు. ఆ భూములను ఆక్రమించి సాగు చేస్తున్నారని, వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని అర్హులైన భూమిలేని పేదలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.

2025 మార్చి 5న సచివాలయం ద్వారా ఆక్రమణదారులకు బహిరంగంగా, వ్యక్తిగతంగా తుది నోటీసులు జారీ చేసినప్పటికీ ఇప్పటికీ భూములు ఆక్రమణదారుల ఆధీనంలోనే ఉన్నాయని వారు పేర్కొన్నారు. ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవడంలో స్థానిక రెవెన్యూ యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.

గత ఏడాది కాలంగా భూమిలేని పేదలు రెండు దఫాలుగా రెవెన్యూ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించి భూ పంపిణీ కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. దరఖాస్తులను విచారించి వాస్తవ అర్హులను ఎంపిక చేస్తామని తహసీల్దార్ ఇచ్చిన హామీ ఇప్పటివరకు అమలుకు నోచుకోలేదని అన్నారు.

భూమిలేని పేదలు ఇంటి స్థలం లేదా ఇతర అవసరాల కోసం ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే వెంటనే చర్యలు తీసుకుంటున్న అధికారులు, అక్రమంగా అసైన్మెంట్ పట్టాలు పొందినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. అధికారుల మెతక వైఖరికి కారణం ఏమిటో ప్రజలకు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. పేదలకు అన్యాయం జరిగేలా ఎవరైనా వ్యవహరిస్తే భూ పోరాట కమిటీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.

అనంతరం భూ సమస్యల పరిష్కారం, ఆక్రమిత భూముల స్వాధీనం, అర్హులైన భూమిలేని పేదలకు భూముల పంపిణీ తదితర డిమాండ్లతో మండల తహసీల్దార్ నాగూర్ మీరాకు వినతిపత్రం అందజేశారు.

ఈ కార్యక్రమంలో చిలకా పోలమ్మ, అంపాపత్తిని, కృష్ణ, దంతెల ప్రేమ్ కుమార్, కత్తి ప్రకాష్, గాలిమోటు ఏసేబు, మల్లెల సైమన్, జీవన్, ఆంధ్రి ప్రశాంతి కుమారి, రూతమ్మ, గురుకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :