కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని చొప్పదండి పోలీస్ స్టేషన్‌ను కరీంనగర్ పోలీస్ అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (అడ్మిన్) పి. వెంకట రమణ గురువారం వార్షికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న ఆయనకు సీఐ ప్రదీప్ కుమార్, ఎస్సై నరేష్ రెడ్డి పూల మొక్కను అందించి స్వాగతం పలికారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.
స్టేషన్ పరిసరాలను పరిశీలించిన అడిషనల్ డీసీపీ ఆవరణలో మొక్కను నాటారు. అనంతరం వివిధ కేసుల్లో పట్టుబడి పోలీస్ స్టేషన్‌లో స్వాధీనంలో ఉన్న వాహనాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. విధుల్లో ఉన్న సిబ్బందితో మాట్లాడి వారికి కేటాయించిన బాధ్యతలు, విధుల నిర్వహణ తీరును పరిశీలించారు.
రికార్డులను పద్ధతిగా నిర్వహించాలని, నమోదైన కేసుల వివరాలను ఎప్పటికప్పుడు సీసీటీఎన్ఎస్‌లో పొందుపరచాలని సిబ్బందికి సూచించారు. తెలంగాణ పోలీస్ శాఖలో వినియోగిస్తున్న వివిధ సాఫ్ట్‌వేర్‌లు, అప్లికేషన్లపై సిబ్బంది పూర్తి అవగాహన పెంచుకుని, వాటిని రోజువారీ విధుల్లో సమర్థంగా వినియోగించాలని సూచించారు.
పోలీస్ స్టేషన్‌కు కేటాయించిన పరికరాలతో పాటు బ్లూ కోల్ట్స్ సిబ్బంది ఉపయోగిస్తున్న పోర్టబుల్ ఫింగర్‌ప్రింట్ డివైస్ పనితీరును కూడా ఆయన పరిశీలించారు. ఎఫ్‌ఐఆర్ ఇండెక్స్‌ను తనిఖీ చేసి పెండింగ్ కేసులపై సమీక్ష నిర్వహించారు. స్టేషన్ పరిధిలో నమోదైన సైబర్ నేరాల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ప్రజలకు పోలీసుల అందుబాటు మరింత పెరిగేలా విజిబుల్ పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని అడిషనల్ డీసీపీ ఆదేశించారు. చొప్పదండి పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాలను సెక్టార్లు, సబ్ సెక్టార్లుగా విభజించి ప్రతి ప్రాంతానికి గ్రామ పోలీసు అధికారులను (GPO) కేటాయించాలని సూచించారు.
అలాగే రౌడీషీటర్లు, హిస్టరీషీటర్లపై ప్రత్యేక నిఘా కొనసాగించాలని, వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనించాలని ఆదేశించారు. ప్రతి నెల వారికి సంబంధించిన తాజా సమాచారాన్ని సేకరించి రికార్డుల్లో నమోదు చేయాలని స్పష్టం చేశారు.
గణేష్ ఉత్సవాలపై పోలీసుల సూచనలు
వార్షిక తనిఖీ అనంతరం మీడియాతో మాట్లాడిన అడిషనల్ డీసీపీ పి. వెంకట రమణ రాబోయే వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ప్రజలకు పలు సూచనలు చేశారు. గణేష్ విగ్రహాలను ఏర్పాటు చేసే నిర్వాహకులు ముందస్తుగా పోలీసుల అనుమతి తీసుకోవాలని కోరారు. విగ్రహాల వద్ద ఎప్పటికప్పుడు వాలంటీర్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
వినాయకుడి ఆగమనం, నిమజ్జనం సందర్భంగా డీజేలు ఏర్పాటు చేయడం, అధిక శబ్దంతో సంగీతాన్ని వినిపించడం, బాణసంచా కాల్చడం వంటి వాటికి అనుమతి లేదని స్పష్టం చేశారు. ప్రజలు పోలీసులకు సహకరించి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా జాగ్రత్తలు పాటించాలని కోరారు.
శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజల సహకారం ఎంతో కీలకమని, అందరూ పోలీసులకు సహకరించి గణేష్ ఉత్సవాలను సురక్షితంగా, శాంతియుతంగా నిర్వహించుకోవాలని అడిషనల్ డీసీపీ విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో చొప్పదండి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ప్రదీప్ కుమార్, ఎస్సై నరేష్ రెడ్డి, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.








