హైదరాబాద్: బొల్లారంలోని మద్రాస్ రెజిమెంట్ బెల్ ఆఫ్ ఆర్మ్స్‌లో ఆగస్టు 31న జరిగిన భారీ ఆయుధాల చోరీ కేసును పోలీసులు, మిలిటరీ అధికారులు ఛేదించారు. కేసుకు సంబంధించిన వివరాలను తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. ఈ ఘటనలో మొత్తం నలుగురు నిందితులను అరెస్ట్ చేసి, చోరీకి గురైన ఆయుధాలు, మ్యాగజైన్లు, బుల్లెట్లు, బైనాక్యులర్ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
విచారణలో బెల్ ఆఫ్ ఆర్మ్స్ ఇన్చార్జ్, అమ్యునిషన్ సెక్షన్ ఇన్చార్జ్ సహకారం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆయుధాగారంలోకి నేరుగా ప్రవేశించే అవకాశం ఉన్న 16 మందిని తొలుత అనుమానితులుగా గుర్తించి సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో హవాల్దార్లు టి.పి.ఎస్. రావు, మల్లేశ్ అలియాస్ రాజు ప్రవర్తనపై అనుమానాలు వ్యక్తమయ్యాయి.
విచారణలో మల్లేశ్ తొలుత అధికారులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసినప్పటికీ, సాంకేతిక ఆధారాలతో ప్రశ్నించడంతో పాటు అతడి భార్యకు పోలీసులు పరిస్థితిని వివరించారు. అనంతరం భార్య ప్రశ్నించడంతో మల్లేశ్ ఆయుధాల చోరీకి పాల్పడినట్లు అంగీకరించినట్లు డీజీపీ తెలిపారు.
ముందస్తు రెక్కీ.. పక్కా ప్రణాళికతో చోరీ
దర్యాప్తు ప్రకారం మల్లేశ్ ఆగస్టు 28, 29 తేదీల్లో ఆయుధాగారం పరిసరాల్లో రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. రాత్రి వేళల్లో సీసీ కెమెరాల నిఘా లేని మార్గాలను ముందుగానే గుర్తించినట్లు తెలిపారు. ఆగస్టు 30న కార్గిల్ గేట్ నుంచి లోపలికి ప్రవేశించి పరిస్థితులను పరిశీలించిన అనంతరం, ఆగస్టు 31న పక్కా ప్రణాళికతో ఆయుధాలను చోరీ చేసినట్లు వెల్లడించారు.
ఆర్మీ నుంచి తనను తొలగించారన్న కోపంతోనే మల్లేశ్ ఈ చర్యకు పాల్పడినట్లు ప్రాథమికంగా భావిస్తున్నామని డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. చోరీ చేసిన ఆయుధాలను తొలుత ఒకచోట పాతిపెట్టిన నిందితుడు, అనంతరం మరో ప్రాంతానికి తరలించినట్లు విచారణలో వెల్లడైంది. ఆయుధాలను ఎందుకు మరోచోటికి మార్చాడనే అంశంపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
ఉగ్రవాద సంబంధాలపై ఆధారాలు లేవు
చోరీకి గురైన ఆయుధాలకు ఇప్పటివరకు ఎలాంటి అంతర్జాతీయ ముఠాలు లేదా ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్నట్లు ఆధారాలు లభించలేదని డీజీపీ స్పష్టం చేశారు. అయితే ఆయుధాల చోరీ దేశ అంతర్గత భద్రతకు తీవ్ర ముప్పుగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
కేసును వేగంగా ఛేదించిన మిలిటరీ అధికారులను, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్‌ను, దర్యాప్తు బృందాలను డీజీపీ సీవీ ఆనంద్ ప్రత్యేకంగా అభినందించారు.








