contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఫైళ్ల పరిష్కారంలో జాప్యం సహించేది లేదు.. అధికారులకు సీఎం చంద్రబాబు వార్నింగ్

అమరావతి: ప్రభుత్వ దస్త్రాల పరిష్కారంలో జాప్యాన్ని ఏమాత్రం సహించబోమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను హెచ్చరించారు. పాలనలో మరింత వేగం, పారదర్శకత తీసుకురావాలని సూచించారు. మంత్రులు, కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు ఫైళ్లను వీలైనంత త్వరగా పరిష్కరించాలని స్పష్టం చేశారు. అమరావతిలో నిర్వహించిన 8వ జిల్లా కలెక్టర్ల సదస్సులో పరిపాలనకు సంబంధించి పలు కీలక ఆదేశాలను సీఎం జారీ చేశారు.

సకాలంలో దస్త్రాలను పరిష్కరించకుండా జాప్యం చేస్తున్న కొందరు అధికారుల తీరుపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రెండు రోజుల్లోపు ఫైళ్లను క్లియర్ చేస్తున్న అధికారులను అభినందించిన ఆయన.. గంటల వ్యవధిలోనే ఫైళ్లను పరిష్కరిస్తున్న వారిని ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు వేగంగా అందాలంటే అధికారులు కూడా అదే వేగంతో పనిచేయాలని సూచించారు.

ఉన్నతాధికారుల గైర్హాజరుపై ఆగ్రహం

కలెక్టర్ల సదస్సుకు కొందరు ఉన్నతాధికారులు గైర్హాజరు కావడంపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గైర్హాజరైన అధికారుల నుంచి వివరణ తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్‌ను ఆదేశించారు. పరిపాలనలో జవాబుదారీతనం అత్యంత కీలకమని పేర్కొన్నారు.

ఐఏఎస్ అధికారుల పనితీరును అంచనా వేసేందుకు 360 డిగ్రీల విధానంలో నివేదిక రూపొందిస్తామని సీఎం తెలిపారు. వివిధ వర్గాల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకుని అధికారుల పనితీరును అంచనా వేస్తామని చెప్పారు. కార్యదర్శులు తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవాలని సూచించారు.

నెల రోజుల్లో అన్ని ఫైళ్లు ఆన్‌లైన్‌లోకి

ప్రభుత్వ కార్యకలాపాల్లో వేగం, పారదర్శకత పెంచేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. నెల రోజుల్లో అన్ని శాఖల దస్త్రాలను పూర్తిగా ఆన్‌లైన్‌లోకి తీసుకురావాలని సీఎం ఆదేశించారు. గడువు అనంతరం కూడా భౌతిక ఫైళ్ల నిర్వహణ కొనసాగితే తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించారు.

ఈ ప్రక్రియపై నెల రోజుల్లోగా సమగ్ర నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు. మంత్రులు కూడా ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించాలని చంద్రబాబు సూచించారు.

క్షేత్రస్థాయి పర్యటనలతో సమస్యలకు పరిష్కారం

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) ద్వారా అందుతున్న దరఖాస్తులను ప్రజలు సంతృప్తి చెందేలా పరిష్కరించాలని కలెక్టర్లకు సీఎం సూచించారు. జిల్లా స్థాయిలో కలెక్టర్లు, నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు, మండల స్థాయిలో అధికారులు తరచూ గ్రామాల్లో పర్యటిస్తే అనేక సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించవచ్చన్నారు.

ఇకపై అధికారులు నిర్వహించే క్షేత్రస్థాయి పర్యటనల వివరాలను కూడా సమర్పించాలని ఆదేశించారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలపై సానుకూల అభిప్రాయం కలిగేలా అధికారులు పనిచేయాలని సూచించారు.

సమర్థులైన అధికారులను ప్రోత్సహించాలి

సమస్యలు లేని సమాజం కోసం ప్రభుత్వ యంత్రాంగంలోని ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. పనితీరు సరిగా లేని వారిని పక్కనపెట్టి, సమర్థంగా పనిచేసే అధికారులను గుర్తించి ప్రోత్సహించాలని స్పష్టం చేశారు.

గ్రామ, వార్డు సిబ్బందికి జాబ్ ఛార్ట్

స్వర్ణ గ్రామ, వార్డు కార్యాలయాల్లో పనిచేస్తున్న సిబ్బందిపై పనిభారాన్ని హేతుబద్ధీకరించాలని సీఎం ఆదేశించారు. ఒకే ఉద్యోగిపై అధిక పనిభారం పడకుండా సిబ్బందికి సమానంగా బాధ్యతలు కేటాయించాలని సూచించారు.

ప్రతి పంచాయతీ పరిధిలోని స్వర్ణ గ్రామ సిబ్బంది విధులు, బాధ్యతలను స్పష్టంగా పేర్కొంటూ జాబ్ ఛార్ట్ రూపొందించాలని ఆదేశించారు. అదేవిధంగా ప్రతి స్వర్ణ వార్డు, గ్రామ కార్యాలయానికి ఒక ఎలక్ట్రిక్ సైకిల్ అందించాలని సూచించారు.

ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత వేగంగా, పారదర్శకంగా అందించడమే లక్ష్యంగా అధికార యంత్రాంగం పనిచేయాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :