గోదావరిఖని : రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని విఠల్‌నగర్ 12వ డివిజన్లో ఇళ్ల మధ్య ఏర్పాటు చేసిన భారీ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ చుట్టూ ఎలాంటి రక్షణ కంచె లేకపోవడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఓ ఇంటికి ఆనుకుని ఉన్న ఈ ట్రాన్స్ఫార్మర్ను బహిరంగంగానే వదిలేయడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. నిత్యం ప్రజలు, చిన్నారులు సంచరించే ప్రాంతంలో ట్రాన్స్ఫార్మర్ చుట్టూ ఎలాంటి భద్రతా ఏర్పాట్లు లేకపోవడం ప్రమాదకరంగా మారిందని వారు పేర్కొంటున్నారు.
ట్రాన్స్ఫార్మర్కు ఎవరైనా అనుకోకుండా తాకినా, ఇతర కారణాలతో విద్యుత్ ప్రమాదం జరిగినా తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇళ్ల మధ్యలో ఉండటంతో ప్రమాదం జరిగితే చుట్టుపక్కల నివాసాలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని వారు చెబుతున్నారు.
ఇప్పటికైనా విద్యుత్ అధికారులు స్పందించి ట్రాన్స్ఫార్మర్ చుట్టూ పటిష్టమైన రక్షణ కంచె ఏర్పాటు చేసి, తగిన భద్రతా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కంటే ముందుగానే అధికారులు చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.








