గన్నేరువరం, కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలంలోని చాకలివానిపల్లి గ్రామంలోని ఎంపీపీఎస్ పాఠశాలలో విద్యార్థినీ, విద్యార్థులకు ప్రభుత్వం అందజేసిన నూతన పాఠశాల యూనిఫామ్‌లను గ్రామ సర్పంచ్ రేపాక బానవ్వ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ రేపాక బానవ్వ మాట్లాడుతూ విద్యార్థుల విద్యాభివృద్ధికి ప్రభుత్వం అందిస్తున్న వివిధ ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత విద్యావంతులుగా ఎదగాలని ఆకాంక్షించారు.
విద్యార్థులు ప్రతిరోజూ క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరవుతూ ఉపాధ్యాయులు అందించే బోధనను శ్రద్ధగా వినాలని, విద్యలో రాణించి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆమె సూచించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు చుక్కయ్య, ఉపాధ్యాయురాలు రజిత, విద్యార్థులు, వార్డు సభ్యులు బోయిని బాలయ్య, నక్క లావణ్య, కూన స్రవంతి, బామండ్ల శ్రీలత, రేపాక బాబు, కూన యాదగిరి తదితరులు పాల్గొన్నారు.








