తూప్రాన్: తూప్రాన్ పట్టణంలో నిషేధిత మత్తు పదార్థం ఆల్ఫాజోలం కలిపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కల్లు దుకాణాలపై ఈగల్ ఫోర్స్, మెదక్ జిల్లా పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. గురువారం రాత్రి పట్టణంలోని నాలుగు కల్లు దుకాణాల్లో తనిఖీలు చేపట్టిన పోలీసులు పలు అంశాలను పరిశీలించారు.
తనిఖీల సందర్భంగా కల్లులో నిషేధిత మత్తు పదార్థం ఆల్ఫాజోలం ఉన్నట్లు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు నాలుగు దుకాణాల్లో సేల్స్మెన్లుగా పనిచేస్తున్న కొత్తపల్లి నర్సింహారావు, మాదాసు శ్రీనివాస్ గౌడ్, పంజాల దుర్గాగౌడ్, జాలిగామ సిద్ధిరాములుపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.
అదేవిధంగా సంబంధిత కల్లు దుకాణం యజమాని రామకృష్ణ, కల్లు సరఫరాదారులు శ్రీనివాస్ గౌడ్, ప్రకాష్ గౌడ్లపై కూడా కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మొత్తం ఏడుగురిపై కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
నలుగురి అరెస్ట్.. ముగ్గురు పరారీ
ఈ కేసులో సేల్స్మెన్లుగా పనిచేస్తున్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు తెలిపారు. మరోవైపు కేసులో నిందితులుగా ఉన్న రామకృష్ణ, శ్రీనివాస్ గౌడ్, ప్రకాష్ గౌడ్ పరారీలో ఉన్నారని పోలీసులు వెల్లడించారు.
కల్లులో నిషేధిత మత్తు పదార్థాలు కలపడం, వాటిని అక్రమంగా సరఫరా చేయడం వంటి చర్యలకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
ఈ వ్యవహారంపై పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ, దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ತನిఖీల్లో లభించిన పదార్థాలకు సంబంధించిన ఆధారాలు, వాటి సరఫరా వెనుక ఉన్న వ్యవహారంపై కూడా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.








