contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఖరీఫ్‌ ధాన్యం కొనుగోళ్లకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

గోదావరిఖని : ఖరీఫ్‌ 2026 సీజన్‌లో ధాన్యం కొనుగోళ్లను ఎలాంటి ఇబ్బందులకు తావులేకుండా పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్‌ బి. శ్రీరాములు సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన ఏర్పాట్లపై అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ.. ధాన్యం రవాణా చేసే ప్రతి వాహనానికి జీపీఎస్‌ ట్రాకర్‌ తప్పనిసరిగా ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఓవర్‌లోడ్‌ను అనుమతించవద్దని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు, రైస్‌ మిల్లుల్లో హమాలీల కొరత రాకుండా ముందుగానే అవసరమైన హమాలీలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

కొనుగోలు కేంద్రాల్లో తూకం యంత్రాలు, మాయిశ్చర్‌ మీటర్లు, ప్యాడీ క్లీనర్లు అందుబాటులో ఉండేలా మెట్రాలజీ అధికారులు తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. రైతులకు ధాన్యం విక్రయించే సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని పరికరాలు సక్రమంగా పనిచేసేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు.

ఏఐ సాంకేతికతతో కొనుగోళ్ల పర్యవేక్షణ

ఈసారి ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఏఐ సాంకేతికతను వినియోగిస్తున్నందున, క్షేత్రస్థాయిలో తాజా ఫొటోలు, తాజా వివరాలను మాత్రమే నమోదు చేయాలని అధికారులకు అదనపు కలెక్టర్‌ సూచించారు.

ప్రభుత్వం ఎంపిక చేసిన సన్న రకాల ధాన్యానికి నిబంధనల ప్రకారం బోనస్‌ అందేలా చూడాలని, ఇందుకోసం ధాన్యం నాణ్యతను ఏఈఓలు, కొనుగోలు కేంద్రాల ఇన్‌చార్జిలు ధ్రువీకరించాలని తెలిపారు.

అదేవిధంగా జిల్లాలో ధాన్యం నిల్వకు అవసరమైన గోదాము స్థలాలను ముందుగానే గుర్తించాలని అధికారులను ఆదేశించారు.

అక్టోబర్‌ 1 నాటికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి

2026 అక్టోబర్‌ 1న ముఖ్యమంత్రి రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్న నేపథ్యంలో, అప్పటిలోగా కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, రైస్‌ మిల్లుల మ్యాపింగ్‌, ధాన్యం రవాణా, గోదాముల గుర్తింపు తదితర అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని అదనపు కలెక్టర్‌ బి. శ్రీరాములు ఆదేశించారు.

రైతులు తమ ధాన్యాన్ని విక్రయించే సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి జాప్యం లేకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.

ఈ సమీక్షా సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనాథ్‌, జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్‌ శ్రీకాంత్‌, జిల్లా సహకార అధికారి శ్రీమాల, రవాణా కాంట్రాక్టర్లు, సంబంధిత శాఖల అధికారులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :